మండపేట ( జనస్వరం ) : అవినీతి సామ్రాట్ లైన సీనియర్లు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావులు కలిసి నియోజకవర్గంలో కోట్లాది సొమ్మును దోపిడీ చేస్తున్నారని మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు కుమ్మక్కై అవినీతి రాజకీయాలు చేస్తూ తమపై బురద చల్లుతూ, నోరు వుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే పడటానికి ఎవరూ సిద్ధంగా లేరని హితవు పలికారు. తనపై ఎమ్మెల్సీ తోట చేసిన వ్యాఖలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తాను జోగేశ్వరరావు సోదరులమని తమ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని తోట ఆరోపించారని వాస్తవానికి వేగుళ్ళ ఇంటి పేరు తప్పితే జోగేశ్వరరావుకు తనకు ఎలాంటి బంధుత్వం లేదని స్పష్టం చేసారు. ఏనాడు జోగేశ్వరరావును అన్నయ్య అని కూడా తాను పిలవలేదని ఇంకా ఆ మాటకొస్తే తోటనే అన్నయ్య అంటూ ఇప్పటికీ సంభోదిస్తానని పేర్కొన్నారు. అసలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తుంది ఇరువురు అని ఆరోపించారు. 2017 నుండి రెండేళ్ల పాటు తాను వైఎస్సార్సీపీ ఇంచార్జిగా ఉండగా అప్పటి ఎమ్మెల్యే వేగుళ్ళ తనను ఎన్నో వేధింపులకు గురిచేసారని, తనపై అక్రమంగా 12 కేసులు ఎమ్మెల్యే వేగుళ్ళ బనాయించారని పేర్కొన్నారు. పైగా ప్రజా పోరాటాలను చేసిన తనపై రౌడీ షీటు వేశారని అలాంటి రాజకీయ ప్రధాన ప్రత్యర్థి జోగేశ్వరరావుకు తనకు లింకులు పెట్టడంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం మండపేట నియోజకవర్గంలో జనసేనకు ఉన్న ఆదరణ, తనపై ప్రజలు చూపుతున్న అభిమానం చూసి ఓర్వలేక తనను ఆర్థికంగా దెబ్బ తీయాలని తనపై కుట్ర పన్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో జనసేన ఉంటే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని భావించి పథకం ప్రకారం ఇద్దరు ఒకటయ్యారని ఆరోపించారు. ఇద్దరు కలిసి కోట్లాది రూపాయల దోచుకుంటున్నారని విమర్శించారు. ఇద్దరు కలిసి అవినీతి చేస్తూ ఊక విమర్శలు చేసుకుంటున్నారని ఆరోపించారు. గాడిద గాడిద అంటూ విమర్శలు చేసుకుంటూ గాడిదకు నెమర లేని విధంగా వీరిద్దరూ నెమరకుండా ప్రజా సొమ్ము దిగమింగుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో రూ 15 కోట్లు ఇసుకలో తోట దోచేసారని ఆరోపించి నానా హైడ్రామా చేసిన ఎమ్మెల్యే వేగుళ్ళ తనకు వాటా వస్తుండటంతో మౌనం వహించారని ఆరోపించారు. తాతపూడిలో ఎస్.సి.ల పేరిట ప్రతి రోజు వేలాది ఇసుక అక్రమంగా తరలిస్తుండగా ఎమ్మెల్యే వేగుళ్ళ నోరు మెదపడం లేదని దీని వెనుక ఇద్దరికీ రోజు రూ 30 లక్షలు జేబుల్లో వెళుతున్న మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. కేశవరం చెర్వు అక్రమ మట్టి తవ్వకాలు చేపడితే ఎందుకు ప్రశ్నించడం లేదని పేర్కొన్నారు. ఇలా నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ప్రజా ధనం దోచుకుంటున్నారని ఆరోపించారు. తాను చేసిన అన్ని ఆరోపణలు రుజువు చేస్తానని సవాల్ చేశారు. ద్వారపూడి రహదారి నిర్మాణంకు సంబంధించి తోట కాంట్రాక్టుర్ నుండి కమిషన్ అడిగిన ఆరోపణలకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. దీన్ని స్వయంగా ఆ కాంట్రాక్టర్ తనను చెప్పారని పేర్కొన్నారు. అన్ని అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చ వేదిక ఏర్పాటు చేస్తే తాను సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. తనను కించ పర్చేలా స్థాయి కోసం తోట వెంపర్లు పడుతున్నారని తాను వారిద్దరి కంటే ఆర్ధికంగా చాలా చిన్నవాడినని, సామాన్యుడినని పేర్కొన్నారు. 70 కోట్ల రూపాయలతో ఎమ్మెల్సీ పదవి కొనే స్థాయి తనది కాదన్నారు. ఇద్దరి వయస్సు 67 కు చేరుతుందని తనకు 47 ఏళ్ళు మాత్రమేనని తాను వారికన్నా చిన్నవాడనే నని పేర్కొన్నారు. తాను, తన అనుచరులు ఎవరైనా తప్పు చేసినట్లు రుజువైతే ఎలాంటి చర్యలకైనా సిద్ధంగా ఉంటామని సవాల్ విసిరారు. విచారణ, దర్యాప్తు చేపట్టి తప్పు చేస్తే దండించే అధికారం ప్రభుత్వంకు ఉంటుందని చెప్పారు. మండపేట ప్రజలు అన్ని ట్రిక్కులు గమనిస్తున్నారని ప్రజా క్షేత్రంలో రాబోయే ఎన్నికల్లో తగిన జవాబు ఇస్తారని పేర్కొన్నారు. ఇప్పటికైనా లాలూచీ రాజకీయాలు మనుకోవలాని హితవు పలికారు.