నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట నిర్విరామంగా 89వ రోజున 51వ డివిజన్ స్థానిక కపాడిపాళెంలోని తెలుగు వీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ కపాడిపాళెంలో సమస్యలు లేని ఇల్లు తమకు కనిపించడం లేదన్నారు. ఒక ఇంట్లో రేషన్ కార్డు తొలగించి ఉంటే, మరొక ఇంట్లో పింఛన్ తొలగించి ఉన్నారని, అనేక ఇళ్ళలో మద్యం మహమ్మారి తీవ్ర సమస్యగా మారిందని, ఏరోజుకారోజు కష్టం చేసుకుని బ్రతికే శ్రమైక జీవుల పరిస్థితులు అధ్వాన్నంగా తయారైనాయని తెలిపారు. ఉచితాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పంచుతున్న డబ్బు అర్హులైన నిరుపేదలకు అందకుండా దారి తప్పుతోందని, అడ్డగోలు నిబంధనలు పెట్టి పలువురిని పథకాలకు దూరం చేసారని మండిపడ్డారు. ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉందని, మునిసిపల్ అధికారులు దృష్టి పెట్టి పరిస్థితులు మెరుగుపరచాలని కోరారు. ప్రజలందరూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, ఆ దిశగా ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎగిరేది జనసేనపార్టీ జెండానే అని, పవనన్న ప్రభుత్వంలో నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.