తిరుపతి, డిసెంబర్ 24 : క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జీవకోనలోని విశ్వం హైస్కూల్‌లో ప్రీ-క్రిస్మస్ వేడుకలను ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం క్రిస్మస్ అలంకరణలతో కళకళలాడింది. విద్యార్థులు తమ స్వయంకృషితో రూపొందించిన సృజనాత్మక, అలంకారాత్మక క్రాఫ్ట్ వర్క్‌తో పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. విద్యార్థులు తయారు చేసిన క్రిస్మస్ ట్రీలు, నక్షత్రాలు, సాంటా క్లాజ్ మోడల్స్, శుభాకాంక్ష కార్డులు అందరి మన్ననలను పొందాయి. తమ సృజనాత్మకతను స్వయంగా ప్రదర్శించిన విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, కళాత్మక ప్రతిభ, బృందాత్మక పని నైపుణ్యాలు మరింత పెరిగాయని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు సాంటా క్లాజ్ వేషధారణలో సందడి చేశారు. విశ్వం హై స్కూల్ చైర్మన్ డా. ఎన్. విశ్వనాథ రెడ్డి మాట్లాడుతూ, విద్యతో పాటు సృజనాత్మకతకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించగలరని అన్నారు. పాఠశాల డైరెక్టర్ విశ్వచందన్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల అంతర్లీన ప్రతిభను వెలికి తీయడమే విశ్వం స్కూల్ లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.