త్వరలో జరుగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న డివిజన్లలో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉటుందని, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉన్నందున అదనపు పోలీసు సిబ్బంది నియమించాలని మచిలీపట్నం జనసేనపార్టీ నాయకులు మంగళవారం కృష్ణాజిల్లా ఎస్పి రవీంద్రనాథ్ బాబుకు వినతిపత్రం అందజేశారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 1, 2, 5, 8, 32, 34, 37 డివిజన్లలో గతంలో జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, పోలింగ్ ముగిసే సమయానికి గంట రెండు గంటల ముందు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలు జరిగాయిన, ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బండి రామకృష్ణ, అధికార ప్రతినిధి లంకిశెట్టి బాలాజీ, జనసేన పార్టీ నాయకులు పేర్ని రవికుమార్, చక్రి తదితరులు జిల్లా ఎస్పీని కోరారు. దీనిపై ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ రిగ్గింగ్, దొంగ ఓట్లు వేసేందుకు అవకాశాలు ఉ౦డవని, కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా అదనపు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామని, ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరిగినా, చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా పోలీసు సిబ్బందితో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించినందుకు ఎస్పీ గారికి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేశారు.