-రంగనాయకులపేట ఉప్పరపాలెంలో పేదల కోసం స్వచ్ఛభారత్ లో భాగంగా కట్టిన మరుగుదొడ్లకు అధికారులు తాళాలు వేశారు
-వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
-తక్షణం ఆ మరుగుదొడ్లను నిర్వహణా స్థితిలోకి తీసుకురావాలి
-పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 122వ రోజున 50వ డివిజన్ రంగనాయకులపేట లోని ఉప్పరపాలెంలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజాసమస్యల అధ్యయనం చేసి ఆ సమస్యల పట్ల పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద పలువురు మహిళలు, వృద్ధులు మరుగుదొడ్లు లేక, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయాల్సి వస్తోందనే సమస్యను చెప్పి మొరపెట్టుకున్నారు. గత ప్రభుత్వ సమయంలో స్వచ్ఛ భారత్ లో భాగంగా ఈ ప్రాంతంలో పలు ఇళ్లల్లో మరుగుదొడ్లు నిర్మించారని, మరుగుదొడ్డి నిర్మించే అవకాశం లేని ఇళ్ళ కోసం ఈ ప్రాంతంలో ఓ చోట ప్రభుత్వం కొన్ని మరుగుదొడ్లను నిర్మించిందని, వాటికి నీటి సప్లై చేసే వారని, ప్రజలు స్వచ్ఛందంగా శుభ్రపరుచుకునే వారని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక నీటి సప్లై వంటి కనీస నిర్వహణ కూడా చేయలేక మరుగుదొడ్లకు తాళం వేశారని, దీంతో ఇక్కడి ప్రజలు నదిలోని బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోందని, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను సావధానంగా విన్న కేతంరెడ్డి సంబంధిత వార్డు సచివాలయంలో అధికారులను సంప్రదించగా ఈ మరుగుదొడ్ల నిర్వహణ ప్రక్రియను మునిసిపల్ కార్పొరేషన్ వాటర్ సప్లై, డ్రైనేజి నిర్వహణ వ్యవస్థల సమన్వయంతో చేయాలని, అందుకు సిబ్బంది లేరని, దాని వల్లే సమస్యగా మారిందని తెలిపారన్నారు. తక్షణం ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులను కేతంరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.