గుంటూరు ( జనస్వరం ) : సినీ నటుల అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించటంతో పాటూ రాజకీయంగా కూడా చైతన్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని ప్రభాస్ యూత్ అధ్యక్షుడు మహమూద్ రఫీ ఆధ్వర్యంలో శ్రీనివాసరావుతోటలో బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిని, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే రాజకీయాల్లో సైతం అభిమానులు చురుకైన పాత్ర పోషించాలని అభిలాషించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా యువత రాజకీయాల్లోకి రావాలని కోరారు. సినీ పరిశ్రమలో నటులందరూ ఎంతో సఖ్యతగా ఉంటారని అదేవిధంగా అభిమానులు కూడా కలిసిమెలిసి ఉండాలన్నారు. ప్రభాస్ అతి తక్కువ సినిమాల్లో నటించినా బాహుబలి లాంటి సినిమాలతో తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాడని కొనియాడారు. పెదనాన్న కృష్ణంరాజు వారసత్వాన్ని కొనసాగిస్తూ సినీ జగత్తులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రభాస్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో దీపక్, హమీద్ , నాగూర్ మీరా, సతీష్ కుమార్, సుదేష్ , రాజశేఖర్ , కుమార్ , రఘు, సాయి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com