గుంటూరు ( జనస్వరం ) : ఆంధ్రా ప్యారిస్ గా, కళల కాణాచిగా పేరుపొందిన తెనాలి నియోజకవర్గం దశాబ్ద కాలంగా ఎలాంటి అభివృద్ధి లేక కునారిల్లుతుందని తెనాలి పట్టణంపై పూర్తి అవగాహన ఉన్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తోనే తెనాలి సమగ్రాభివృద్ధి సాధ్యమని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. సోమవారం తెనాలిలో నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం కానున్న నేపధ్యంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నాదెండ్ల మనోహర్ ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటం శుభపరిణామమన్నారు. తెనాలి శాసనసభ్యుడిగా నాదెండ్ల మనోహర్ చేసిన అభివృద్ధి మినహా దశాబ్ద కాలంగా తెనాలిలో అంగుళం అభివృద్ధి కూడా జరగలేదని విమర్శించారు. ప్రస్తుత శాసనసభ్యులు శివకుమార్ ఎమ్మెల్యే పదవిని బాధ్యతగా కాకుండా ఎంజాయ్ చేస్తున్నారని దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో అభివృద్ధి అనేది ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. వైసీపీ అసమర్ధ, నియంతృత్వ పాలనతో ప్రజలు విసిగిపోయారని ధ్వజమెత్తారు. తెనాలి అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకున్న నాదెండ్ల మనోహర్ కు రానున్న ఎన్నికల్లో పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సోమవారం తెనాలిలో జరిగే పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ప్రజలు, జనసైనికులు, వీరమహిళలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆళ్ళ హరి కోరారు.