● పవనన్న ప్రజాబాటలో జనసేనపార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద వాపోయిన బాధితులు
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 145వ రోజున 49వ డివిజన్ ఈద్గామిట్ట మసీదు సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగి ప్రజాసమస్యల అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద పలువురు మహిళలు మాట్లాడుతూ గతంలో తమకు సామాజిక పింఛన్లు వితంతు, వృద్ధాప్యం ఆధారంగా ఇచ్చే వారని, కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం రేషన్ కార్డుల్లో ఉండే కుటుంబసభ్యుల ఆధారంగా ఇస్తూ పింఛన్లు ఎత్తేసిందని ఆవేదన వెలిబుచ్చారు. కన్నకొడుకులు కూడు పెట్టని వారికి ప్రభుత్వం పింఛన్ రూపంలో కూడు పెడుతుంటే, జగన్ వచ్చి ఆ కూడుని కూడా లాగేసాడని పలువురు వాపోయారు. ఓ మహిళ మాట్లాడుతూ తమ కుమార్తెకు పెళ్ళి అయిందని, ఇటీవల గ్రామ సచివాలయంలో ఉద్యోగం వచ్చిందని, దాని వల్ల తమకు పింఛన్ ఆగిపోయిందని, రేషన్ కార్డులో కుమార్తె కుటుంబాన్ని స్ప్లిట్ చేయాలని ఎన్నిసార్లు సచివాలయం చుట్టూ తిరిగినా పని కావట్లేదని, జగన్ వచ్చి తమ ఆర్థిక భరోసాని దెబ్బతీసాడని వాపోయింది. సమస్యలన్నీ సావధానంగా విన్న కేతంరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరి ఆశీస్సులతో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే అని, పవనన్న ప్రభుత్వంలో ఇలాంటి అడ్డగోలు నిబంధనలకు స్వస్తి చెప్పి పారదర్శకమైన పాలన అందించి అర్హులు అందరికీ న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.