ఆముదాలవాలస ( జనస్వరం ) : అంగన్వాడీల విధుల నిర్వహణలో సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నాలలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలోని అంగన్వాడీలు స్థానిక కలెక్టర్ కార్యాలయం ఆవరణలో భారీ స్థాయిలో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు జనసేన పార్టీ తరఫున ఆముదాలవలస నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు గారు మద్దతు తెలియజేస్తూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ప్రతి తల్లి ఏ విధంగా తన బిడ్డల సంరక్షణ చూస్తారో అదే విధంగా ప్రతి అంగన్వాడీ కూడా ఒక తల్లిలా బాధ్యతలు నిర్వర్తిస్తూ, పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని, అటువంటి అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం వారిని రోడ్లపైకి తీసుకువచ్చే విధంగా చర్యలు చేపట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా స్వాధీనపరుచుకొని వైసీపీ ప్రభుత్వం మహిళా వాలంటీర్లతో అంగన్వాడి సేవలు నిర్వహించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దాదాపు ఐదేళ్లు ఏళ్ళు కావస్తున్న నేటికీ హామీలు నెరవేర్చకపోవడం ఆ పార్టీ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీలకు సత్వరమే రెగ్యులర్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే వారి సేవలకు తగ్గ వేతనాలను చెల్లించేందుకు జీతాలు పెంచి అంగన్వాడీల విధి నిర్వహణకు సహకరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రామ్మోహన్ తో పాటు సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళీమోహన్, గంగు కోటేష్, పొట్నూరు ప్రసాద్, పొన్నాడ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.