– అధికారంలోకి వస్తే అన్ని సమస్యలను పరిష్కరిస్తాం
– వెట్టి చాకిరీ చేయించుకుంటున్నా ఉద్యోగ భద్రత కల్పించిన ప్రభుత్వ
– సమగ్రశిక్షా అభియాన్ ఉద్యోగులు, అంగన్ వాడీల ఆందోళనల్లో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి ( జనస్వరం ) : రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా… ఎవరు సమస్యల్లో ఉన్నా… ఆ సమస్య గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఏకైక గొంతు పవన్ కళ్యాణ్ అన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. మంగళవారం తిరుపతిలో సమగ్రశిక్షా అభియాన్ , అంగన్ వాడీలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో వేర్వేరుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాటతప్పను మడమ తిప్పను అని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సిఎం జగన్ తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు, అంగన్ వాడీ వర్కర్లు రోడ్డు మీద కూర్చోవడానికి కారణం సిఎం జగన్ ఇచ్చిన హామీలేనన్నారు. బటన్ నొక్కి కొన్ని వేల మందికి సాయం చేస్తున్నానని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి… వెట్టి చాకిరి చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లను అదే బటన్ నొక్కి నెరవేర్చాలని కోరారు. హామీ ఇచ్చే ముందు అది నెరవేర్చగమా? లేదా? అని తెలుసుకున్నాకే హామీ ఇవ్వాలన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఇప్పుడు అది సాధ్యం కాదంటూ సమాధానం చెప్పడం సిగ్గుచేటన్నారు. తుఫాను బాధితులకు, అన్నమయ్య డ్యాం బాధితులకు, విశాఖ ఉక్కు కార్మికులకు, ఉద్దానం కిడ్నీ బాధితులకు, అమరావతి రైతులకు పవన్ కళ్యాణ్ అండగా నిలిచారన్నారు. తాను కూడా చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులుగా అనేక ప్రజా పోరాటాల్లో పాల్గొని సమస్యల పరిష్కారం కోసం క్రుషి చేశానని చెప్పారు. సులభ్ కార్మికుల సమస్యలను, ఎఫ్ఎంఎస్ సిబ్బంది, టిటిడి ఒప్పంద అధ్యాపకుల సమస్యలను పరిష్కరించానని తెలిపారు. అంగన్ వాడీ వర్కర్ల సమస్యలను పవన్ కళ్యాణ్ ద్రుష్టిలో ఉన్నాయని ఆయన కూడా మద్దతు తెలిపారన్నారు. త్వరలోనే తమ ప్రభుత్వం రాబోతోందని, కచ్చితంగా సాధ్యాసాధ్యాల మేరకు సమగ్రశిక్షా అభియాన్, అంగన్ వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.