విశాఖ, (జనస్వరం) : విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ సరికాదు… ఈ కర్మాగారం భావోద్వేగాలతో ముడిపడి ఉందనే విషయంలో జనసేన పార్టీ చాలా స్పష్టతతో ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు అదే స్టాండ్ కు కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చి ఉక్కు పరిరక్షణ పోరాటంలో పాలు పంచుకుంటారని వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ పోరాటం ఇది… దేశం మొత్తం మాట్లాడేలా ముందుకు వెళ్ళాలని చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, స్టీల్ ప్లాంటు నిర్వాసితులతో ఆదివారం ఉదయం విశాఖపట్నంలో సమావేశమయ్యారు. వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరై 220 రోజులుగా తాము చేస్తున్న పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “మాట తప్పం… మడం తిప్పమని గొప్పలు చెప్పుకొనే నాయకులు పార్లమెంటులో ఒక మాట ఇక్కడో మాట మాట్లాడుతున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏదైనా అంశంపై ఒక మాట మాట్లాడారంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారని తెలిపారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాకా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గరని తెలియజేశారు. ఇచ్చిన మాట కోసం నిజాయితీగా పోరాడతారన్నారు. అమిత్ షాకి సమగ్రంగా వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలనేది పవన్ కళ్యాణ్ అభిప్రాయమని, ఈ ప్లాంట్ కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన వారి కష్టాలను నాటి పోరాటం లోని త్యాగధనుల గొప్పదనాన్ని గుర్తించే నాయకుడాయన అని కొనియాడారు. కేంద్రం నిర్ణయం ప్రకటించిన వెంటనే పవన్ కళ్యాణ్, తను ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు ముఖ్యులతో మాట్లాడినట్లు తెలియజేశారు. అమిత్ షా దృష్టికి – 34 మంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంటు ఏర్పాటైందనే విషయాన్ని జనసేనని బలంగా చెప్పారు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశం ఇది అని… లక్షలాది మంది ప్లాంటుపై ఆధారపడి జీవిస్తున్నారని తెలియజేసినట్లు తెలిపారు. దేశంలోని మిగతా ప్లాంటులతో దీనిని పోల్చకండని, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. వాళ్లతో మాట్లాడాకా సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం ఏర్పడిందన్నారు. కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి మా నాయకులు మద్దతు తెలుపుతూనే ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చి నిర్వాసితులు నష్టపోయిన కుటుంబాల గురించి కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్ళామన్నారు. ఈ అంశంపై ప్రత్యేకంగా శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి ప్రైవేటీకరణ అంశంపై చర్చించి, అందరి అభిప్రాయాలను క్రోడికరించి కేంద్రానికి తీర్మానం పంపించాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరితే, ప్రభుత్వం మాత్రం తూతూ మంత్రంగా తీర్మానం చేసి పంపించిందన్నారు.
విశాఖ ఉక్కు పేరుతో ప్రచారం వద్దు
జీవీఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేయండని అడగడానికి వచ్చిన నాయకులతో పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పారు. స్టీల్ ప్లాంటు అంశాన్ని రాజకీయ ప్రచారం కోసం వాడుకోవడం సరికాదు.. ఇది త్యాగాలతో వచ్చిన పరిశ్రమ అన్నారు. చిత్తశుద్ధి లేని రాజకీయ పార్టీలతో కాకుండా కార్మిక సంఘాలతో ఏర్పాటైన జేఏసీ పోరాటానికి అండగా ఉండాలని చెప్పారు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ వచ్చి మీతో పాటు నిలబడతారన్నారు. ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర పెద్దలు సానుకూలంగా స్పందిస్తారనే నమ్మకం మాకు ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే విధంగా మనందరం కలిసి పోరాటం చేద్దామని” పిలుపునిచ్చారు. అంతకు ముందు విశాఖపట్నం లోని పార్టీ ఉత్తరాంధ్ర కార్యాలయంలో జనసేన కు మద్దతుగా నిలిచిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ స్టీల్ ప్లాంట్ కోసం తీసుకున్న నిర్ణయాలను మనోహర్ ఎం తెలియజేశారు. ఈ సమావేశాలలో పార్టీ ప్రధాన కార్యదర్శులు టి. శివ శంకర్, సత్య బొలిశెట్టి, పిఏసి సభ్యులు కోన తాతారావు, పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం, పార్టీ నాయకులు సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కరరావు, గడసాల అప్పారావు, బోడపాటి శివదత్, పి. ఉషాకిరణ్, గోవింద రెడ్డి పాల్గొన్నారు.