నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 285వ రోజున 46వ డివిజన్ మండపాలవీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో బంగారు నగల దుకాణాలకు నెలవు మండపాలవీధి అని అన్నారు. మారుతున్న కాలంలో కార్పొరేట్ జ్యువెలరీ సంస్థలతో పోటీ ఎదుర్కోవడం ఇక్కడి బంగారు వ్యాపారులకు ఒక సవాలు అయితే వైసీపీ ప్రభుత్వ ఆగడాలను భరించడం మరొక సవాలుగా మారిందన్నారు. కోవిడ్ సమయంలో ఇక్కడి వ్యాపారులను వైసీపీ ప్రభుత్వంలోని నేతలు ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో, వ్యాపారులందరూ ఒక యూనియన్ లా మారి ఆ సమస్యలపై ఎలా పోరాడారో నగర ప్రజలందరూ చూసారన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో రాబోయేది పవనన్న ప్రభుత్వం అని, తమ గుర్తు గాజు గ్లాసు ఎంత పారదర్శకంగా ఉంటుందో, అంతే పారదర్శకతతో పవన్ కళ్యాణ్ గారు, తాము ఉంటామని, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచాక నెల్లూరు బంగారు నగల తయారీ, అమ్మకాలను వ్యాపారులు ఎవ్వరికీ భయపడకుండా, స్వేచ్ఛగా నిర్వహించుకునేలా అందరికీ తోడుగా నిలుస్తానని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.