అనంతపురం, నవంబర్ 7, జనస్వరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ముఖ్యమైన ముందడుగు పడింది. రాష్ట్రంలో తొలిసారిగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించడం విశేషం. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యురాలు పరిటాల సునీత ఆదేశాల మేరకు అనంతపురం మండలం కందుకూరు పంచాయతీ పాఠశాలలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు సమావేశంలో మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లల చదువును గురించి టీచర్లను అడిగి తెలుసుకోవాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగైన మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనాలు, డిజిటల్ క్లాస్‌రూమ్స్ అందుబాటులోకి తెచ్చామని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరిస్తే విద్యార్థుల బంగారు భవిష్యత్తు సాఫల్యం సాధ్యమవుతుందని అన్నారు. ఇది మాత్రమే కాకుండా, స్కూల్ అభివృద్ధి కోసం తాను విద్యార్థినిగా చదివిన పాఠశాల కావడంతో తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పడే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, మెమొరీ టెక్నిక్స్ క్లాసులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పాఠశాల అభివృద్ధి కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల కోసం ప్రభుత్వం చేసిన కృషి, తల్లిదండ్రుల చైతన్యం, గ్రామస్థుల భాగస్వామ్యం వంటి అంశాలను చాటిచెప్పిందని చెప్పారు. ఈ సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు, స్కూల్ కమిటీ చైర్మన్ ఓబులపతి, ప్రధానోపాధ్యాయులు, కమిటీ సభ్యులు పూల ఒబిరెడ్డి, పాల మళ్ళీ, మురళీ, రామప్ప, పెద్దన్న, బాలకృష్ణ, ఓబులేషు తదితరులు పాల్గొన్నారు.