దేశానికి పల్లెలు జీవధారా సదృశాలు. దేశ ఆర్థిక ప్రగతికి పల్లెలు పట్టుకొమ్మలు. దేశ సౌభాగ్యానికి, సౌభ్రాతృత్వానికి, సహజీవనానికి పల్లెలు కాణాచులు, ఆదర్శాలు, రైతు దేశానికి వెన్నెముక వంటి వాడని మహనీయులు పేర్కొన్న మాటలు అక్షర సత్యాలు. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. పంచాయితీ అభివృద్ధి అంతా మన చేతుల్లోనే ఉంది. పార్టీలకతీతంగా ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో పంచాయితీ ఎన్నికల హడావిడి మొదలయింది. ఒకసారి ఎన్నికలు ఎలా జరుగుతాయి ? ఎవరు పోటీ చేయొచ్చు ? అధికారాలు ఎలా ఉంటాయి వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
పంచాయితీ ఎలా ఏర్పడింది ? :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959 అక్టోబరు 11న నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో మొదటి పంచాయతీ సమితిని లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోది. ఆ తర్వాత అశోక్ మెహతా సిఫారసులను అనుసరించి 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు పంచాయతీ వ్యవస్థను రద్దుచేసి, మండల పరిషత్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మండల పరిషత్ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత కొన్ని కమిటీలు చేసిన సిఫారసులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఆధారంగా 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది.
గ్రామసభ :
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పారదర్శకతను, బాధ్యతాయుతమైన పరి పాలనను ఇనుమడింపజేసేదే గ్రామసభ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి గ్రామసభకు సర్పంచ్, సర్పంచ్ లేనప్పుడు ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. గ్రామ పంచాయతీ సరిహద్దు లోపల సభ్యులకు అనుగుణంగా సూర్యోదయం తర్వాత సూర్యా స్తమయంలోపు గ్రామసభ సమావేశాన్ని ఎప్పుడైనా నిర్వహించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామసభను సంవత్సరానికి నాలుగుసార్లు (జనవరి 2, ఏప్రిల్ 14, జులై 1, అక్టోబరు3) తప్పనిసరిగా నిర్వహించాలి. అయితే అవసరాన్ని బట్టి గ్రామసభను ఎన్నిసార్లయినా సమావేశపరచవచ్చు. కనీసం 50 మంది లేదా కనీసం 10% మంది సభ్యులు (ఏది ఎక్కువైతే అది) సభను ఏర్పాటు చేయమని లిఖితపూర్వకంగా కోరినట్లయితే సర్పంచ్ తప్పనిసరిగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం గ్రామసభ నిర్వహణకు కోరం నిర్ణయించలేదు. గ్రామ సభలో ప్రతి గ్రామ ఓటరూ పాల్గొని తమ సమస్యలను, అభ్యంతరాలను తెలియజేయవచ్చు.
పోటీ చేయడానికి అర్హతలు :
పరిశీలన నాటికి అభ్యర్థి వయస్సు 21 ఏళ్లు పూర్తయి ఉండాలి. పోటీ చేసే గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలో తప్పని సరిగా ఓటరుగా నమోదై ఉండాలి. ఒక వ్యక్తి ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ఎన్నికలలో పోటీ చేయడానికి వీలు లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు పోటీకి అర్హులు కారు. పోటీ చేస్తున్న వ్యక్తిపై నేరారోపణపై శిక్షపడి దోషిగా నిర్ధారిస్తే పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు.
పంచాయితీ సంస్థలు ఏం చేస్తాయంటే ? :
ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాయి. స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన పరిపాలనా భారాన్ని తగ్గిస్తాయి.
గ్రామ సభ :
గ్రామంలోని ఓటర్లందరూ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు. గ్రామ పంచాయతీకి గ్రామసభ ప్రాతిపదికగా పనిచేస్తుంది. గ్రామసభ గ్రామ పంచాయతీకి శాసన శాఖగా పనిచేస్తుంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి గ్రామసభను ప్రాతిపదికగా పేర్కొనవచ్చు. గ్రామ పంచాయతీ గ్రామసభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాలను గ్రామసభ రూపొందిస్తుంది. గ్రామ సభ సంవత్సరానికి రెండుసార్లు సమావేశం కావాలి. ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్యకాలం 6 నెలలు మించకూడదు. ఒకవేళ సంవత్సరానికి రెండుసార్లు గ్రామసభను ఏర్పాటు చేయకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు.
ఆర్థిక వనరులు :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధులు ఇంటిపన్ను, నీటి పన్ను, అడ్వర్టైజ్ పన్ను, సంతలు, మార్కెట్లపై పన్ను అద్దెలు, అమ్మకాల ద్వారా లభించే ఆర్థిక వనరులు. రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన కొన్ని పన్నులను పంచాయతీలకు జమ చేయవచ్చు. రాష్ట్ర శాసన సభ ప్రత్యేక శాసనం ద్వారా కొన్ని అంశాలకు సంబంధించి, పన్నులు విధించి, వసూలు చేసే అధికారాన్ని పంచాయతీలకు బదలాయించవచ్చు. దాతలు సమకూర్చే విరాళాలు. ఈ విధంగా గ్రామ పంచాయితీ ఆర్థిక వనరులను సమకూర్చుకుంటుంది.
గ్రామసభ - విధులు :
గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్షిక పరిపాలనను పరిశీలించడం. ఆడిట్ నివేదికలను పరిశీలించడం, ఆమోదించడం. కొత్తగా పన్నులు విధించడానికి లేదా ప్రస్తుతం ఉన్న పన్నులను పెంచడానికి ప్రతిపాదనలు చేయడం. ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయడం. గ్రామసభలో చేసిన తీర్మానాలకు గ్రామపంచాయతీ సముచిత ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పేర్కొంది.
సర్పంచ్ అధికారాలు - విధులు :
సర్పంచ్ గ్రామ పంచాయతీకి రాజకీయ అధిపతి. గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడిగా వ్యవహరిస్తారు. నెలకొకసారి గ్రామ పంచాయతీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. 6 నెలల కొకసారి గ్రామసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. గ్రామ పంచాయతీ వార్షిక ఖాతాలను ప్రతి సంవత్సరం ఆడిట్ చేయిస్తారు. గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేస్తారు. పంచాయతీ సభ్యుల అనర్హతలను జిల్లా పంచాయతీ అధికారికి తెలియజేస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ అధికారి నుంచైనా ఎలాంటి సమాచారాన్నైనా సర్పంచ్ పొందగలరు.పంచాయతీ కార్యదర్శిపై పరిపాలనా పరమైన నియంత్రణ ఉంటుంది. మనదేశంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థల పని తీరును ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం నిర్మల్ గ్రామీణ పురస్కార్ అవార్డులను ప్రవేశపెట్టింది.
A. ఉత్తమ గ్రామ పంచాయతీ - 7 లక్షల రూపాయలు
B. ఉత్తమ మాధ్యమిక వ్యవస్థ - 15 లక్షల రూపాయలు
C. ఉత్తమ జిల్లాపరిషత్ - 25 లక్షల రూపాయలు. ఈ పారితోషికాలను ఆ సంస్థల అభివృద్ధికి వినియోగించాలి.
వార్డు సభ్యులు :
గ్రామాన్ని జనాభా ప్రాతిపదికపై వార్డులుగా విభజిస్తారు. ప్రతి వార్డు నుంచి ఒక సభ్యుడు రహస్య ఓటింగు పద్ధతిన ఐదేళ్ల కాలానికి ఎన్ను కుంటారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు, వెనుకబడిన తరగతులు, స్త్రీలకు సీట్లు కేటాయింపు ఉంది. పార్టీ రహితంగా ఎన్నికలను నిర్వహిస్తారు. ఒక సభ్యుడు ఒకటి కంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీ చేయడానికి వీల్లేదు. ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్‌తో కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది. కలిపి కనిష్టంగా 5, గరిష్టంగా 21 మంది వరకు సభ్యులు ఉంటారు. వార్డుల విభజన గ్రామ జనాభాను బట్టి కింది విధంగా ఉంటుంది.
సర్పంచ్ - పదవీకాలం :
సర్పంచ్ పదవీకాలం సాధారణంగా 5 సంవత్సరాలు. గ్రామ సభను సకాలంలో నిర్వహించని సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. ఈ విధంగా పదవిని కోల్పోయినట్లయితే, పదవిని కోల్పోయిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు ఏవిధమైన ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హతలకు గురవుతారు. సర్పంచ్, ఉప సర్పంచ్‌లు అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారిని పదవి నుంచి తొలగిస్తుంది. వీరు 2 సంవత్సరాల వరకు తిరిగి ఆ పదవులకు పోటీ చేయరాదు. గ్రామ పంచాయతీ అకౌంట్లను ఆడిట్ చేయించని సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వీల్లేదు. ఎన్నికలకు సంబంధించిన నేరాలకు పాల్పడినందుకు ఎవరైనా శిక్షకు గురైతే, శిక్ష విధించిన రోజు నుంచి పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ - 233 ప్రకారం 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీచేయరాదు. సర్పంచ్ తన రాజీనామాను గ్రామ పంచాయతీకి పంపాలి. ఏదైనా కారణం వల్ల గ్రామ పంచాయతీకి పంపే వీలు లేకపోతే సర్పంచ్ తన రాజీనామాను జిల్లా పంచాయతీ అధికారికి పంపాలి.
సర్పంచ్ల రిజర్వేషన్లు :
2013, జులైలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్ల కోసం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకున్నారు. బీసీ వర్గాల రిజర్వేషన్ల కోసం జిల్లాను యూనిట్‌గా తీసుకున్నారు. మొత్తం సర్పంచ్ పదవుల్లో 50% స్త్రీలకు రిజర్వు చేయాలి. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 1/3వ వంతు సీట్లను ఈ వర్గాల మహిళలకు కేటాయించాలి.
పంచాయతీరాజ్ ఎందుకు? :
వనరుల పంపిణీలను మెరుగుపరచడానికి.ప్రభుత్వ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చేయడానికి. గ్రామీణ ప్రజల దైనందిన అవసరాలను మేలైన పద్ధతిలో తీర్చడానికి.స్థానికంగా అధికంగా ఉద్యోగాలు కల్పించడానికి. పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడానికి పంచాయితీ రాజ్ ఉపయోగపడుతుంది.
మనలో చాలా మంది యువతకు పంచాయితీ ఎన్నికల్లో నిలబడాలని ఉంటుంది. కానీ సరైన అవగాహన లేక, స్థానిక ఇతర పార్టీ నాయకుల ఒత్తిళ్ళ వల్ల మధ్యలోనే ఆగిపోతుంటారు. మీరే సర్పంచ్ గా గెలిచి మీ గ్రామాన్ని మీరే అభివృద్ధి చేసుకునే గొప్ప అవకాశం మీ చేతుల్లోనే ఉంది. కావున రాజకీయంగా, ఒక నాయకుడిగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ ఎన్నికలు ఒక గొప్ప అవకాశం. ఉపయోగించుకోండి.
By
చంద్ర శేఖర్
@ChandrasekharJSP
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com