ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం లో రెవెన్యూ డివిజన్ ను కొనసాగించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధర్మవరం ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి నిరసన పాదయాత్రను ధర్మవరం పట్టణంలో పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ నిరసనకు మద్దతుగా అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ విచ్చేసి మద్దతు తెలిపారు. మధుసూధన్ మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా ఉన్న ధర్మవరం రెవెన్యూ డివిజనను రద్దు చేసి కొత్త జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పాటు కానున్న పుట్టపర్తి రెవెన్యూ డివిజన్‌లోకి విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1953లో ధర్మవరం రెవెన్యూ డివిజన్ ఏర్పడింది. ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల పరిధిలోని 17 మండలాలు దీని పరిధిలో ఉండేవి. 2013లో కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ ఏర్పడటంతో అందులోకి కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల మండలాలు వెళ్లాయి. దీంతో ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ, రాష్తాడు నియోజకవర్గంలోని రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాలతో డివిజన్ కొనసాగింది. ఇటీవల సత్యసాయి జిల్లా ప్రకటనతో అనంతపురం రెవెన్యూ డివిజన్‌లోకి రాప్తాడు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలు చేర్చారు. రామగిరి మండలాన్ని కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్‌లోకి మార్పు చేశారు. ధర్మవరం నియోజకవర్గంలోని 4 మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా కొనసాగుతుందని అందరూ భావిస్తున్న తరుణంలో డివిజన్ రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులను వెలువరించింది. దీనిని జనసేనపార్టీ తరుపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అని చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.