నంద్యాల, మార్చి 29, జనస్వరం : నంద్యాల పట్టణ వీధుల్లో కాషాయ దళం ఆదివారం వైభవంగా పథసంచలన కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా ప్రజలు, అభిమానుల ఆహ్వానం, ఆనందోత్సాహాల మధ్య పుష్పవర్షంతో ఈ కార్యక్రమం ఘనంగా సాగింది. కాషాయ ధ్వజం ఆధ్వర్యంలో ఘోష్ వాయిద్యాల లయబద్ధ సంగీతంతో దళం గర్వంగా కదలిక సాగించింది. జిల్లా సంఘ్ చాలక్ చిలుకూరి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రధాన వక్త ప్రాంత కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్ పుట్టా శేషు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేషభూషణాలతో ఎవ్వరూ భారతీయులు కాలేరని, భారతమాతను పూజించే వారు, గౌరవించే వారే నిజమైన భారతీయులని పేర్కొన్నారు. దేశంలోని ఇతర మతాలకు చెందిన వారు కూడా ఈ నేల పుట్టినవారేనని, అందరూ కలిసికట్టుగా దేశ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. కొంతమంది స్వార్థపరులు విదేశీ మద్దతుతో దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని, అలాంటి కుట్రలను ఎదుర్కోవడానికి సంఘ్ కార్యకలాపాలను విస్తరించాలని పిలుపునిచ్చారు. సంఘ్ సనాతన ధర్మ పునరుజ్జీవనానికి మాత్రమే కట్టుబడి ఉందని, ఏ మతానికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అందరినీ కలుపుకొని భారతమాతను విశ్వగురువుగా నిలబెట్టే దిశగా ముందుకు సాగాలని కోరారు.
