నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 257వ రోజున 53వ డివిజన్లో వెంకటేశ్వరపురం పోస్టాఫీసు వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తిరుగుతుంటే పింఛన్ పోగొట్టుకున్న బాధితులు ఎక్కువగా కనిపిస్తున్నారని అన్నారు. గతంలో పింఛన్ తీసుకునే ప్రతి ముగ్గురు అర్హుల్లో ఒకరికి సహేతుక కారణాలు లేకుండా ఇప్పుడు పింఛన్ ఎత్తేసారని అన్నారు. ఆఖరికి దివ్యాంగులకు కూడా తొలగించారని, ప్రతి ఒక్కరు తమ గోడుని వెళ్లబోసుకుంటున్నారని అన్నారు. వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు తమ స్థితిని బట్టి పింఛన్ ఇచ్చే పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం లేదని, పవనన్న ప్రభుత్వంలో అర్హులందరికీ పింఛన్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.