విజయవాడ (జనస్వరం) : మటన్ మార్ట్ లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, ఆరెకటికల జీవనోపాధిపై భారం పడేలా చేస్తే సహించేది లేదని విజయవాడ నగర సహాయ కార్యదర్శి సాబింకర్ నరేష్ అన్నారు. ఈ సందర్భంగా విజయవాడ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5 రోజుల క్రితం సీఎం జగన్ రెడ్డి మటన్ మాల్ట్ ని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారని, ఆరెకటికలు స్వతంత్రం రాక ముందు నుంచి తాతలు ముత్తాతలు వృత్తిని జీవనోపాధిగా చేసుకొని లక్షల మంది జీవిస్తున్నారని తెలిపారు. వారి జీవనోపాధి మీద దెబ్బ కొట్టే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏపీలోని ఆరెకటిక మొత్తం ఏకమై సీఎం ఇంటి ముట్టడి చేస్తామని హెచ్చరించారు. రేయనకా పగలనకా తేడా లేకుండా వివిధ జిల్లాలో వెళ్లి ఎక్కడ సంత జరుగుతాయో అక్కడ మంచి ఆరోగ్యకరమైన పొట్టేళ్లని కొనుగోలు చేసి రవాణా చార్జీలు చెల్లించి టోల్ గేట్ చార్జెస్ చెల్లించి కబేలలో డాక్టర్ సమక్షంలో మున్సిపాలిటీ వాళ్లకి ఒక మేకకి 15 రూపాయలు స్లాటర్ చెల్లిస్తున్నామని తెలిపారు. ఒక్క విజయవాడ నగరంలోని సుమారు 1200 మాంసం దుకాణాలు ఉంటే ఒక్క ఆదివారం ఒక్క రోజు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.50000లు అని తెలియజేశారు. మిగతా రోజుల్లో రోజుకి సుమారు రూ.10000లు వస్తుందని, నెలకి ప్రభుత్వానికి సుమారుగా రూ.6 లక్షలు టాక్స్ రూపంలో చెల్లిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్లో మిగతా 13 జిల్లాల్లో సుమారుగా రూ.30 లక్షలు టాక్స్ రూపేనా ప్రభుత్వానికి మేము చెల్లిస్తున్నామనీ, ఒక సంవత్సరానికి సుమారు 5 కోట్ల రూపాయల టాక్స్ కేవలం మాంసం అమ్మకాల మీద ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని తెలిపారు. అలాంటి మా నోరు కొట్టాలని ప్రభుత్వం చూస్తే మేము ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. మళ్లీ ఇది కాక దుక్క కత్తి లైసెన్స్ నిమిత్తం సుమారు రెండు వేల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తున్నామని తెలిపారు. కరోన మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా ప్రభుత్వం మమ్మల్ని ఏ విధంగా కూడా ఆదుకోలేదన్నారు. ఇప్పుడు ఈ దిమాక్ లేని ప్రభుత్వం కులాల మీద, కుల వృత్తి వ్యాపారుల మీద అవగాహన లేని సలహాదారుల మాట విని ఆరెకటిక జీవనోపాధి మీద దెబ్బ కొట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు. స్థానిక విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ముందు ఆరెకటిక కులాన్ని ఆదుకుంటామని, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వం మా జీవనోపాధి మీదే దెబ్బ కొట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటే స్పందించకుండా ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఈ సమస్య తన సమస్యగా తీసుకొని ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ సంచార మాంసం కొట్టు వాహనాల్ని విజయవాడలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్టకుండా మంత్రి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నడిపించడానికి డబ్బులు లేవంటున్నారు. కనుక నెలకు రూ.100లు చందా ఇమ్మంటే సంతోషంగా ఇస్తామన్నారు. అంతే కానీ మా నోటి కాడ కూడు లాక్కో వద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆరెకటిక జిల్లా నాయకులు కోవెలకారు.రాకేష్ జీ, బిజెపి ఓబీసీ మోర్చా సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్, సోనీ భాయ్, శ్రీనివాసరావు, రఘు, శివ నాయక్ తదితరులు పాల్గొన్నారు.