ఇప్పడు అందరికి ఒకటే ప్రశ్న. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది? జనసేన పార్టీ తన బలానికి తగ్గట్లుగా పోటీ చేస్తుందా? ఆ సంఖ్య ఓట్ల బదిలీ పై ఏ విధంగా ప్రభావం చూపిస్తుంది? దీనిని చర్చించే ముందు ఒకసారి చరిత్ర చూద్దాం....
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన రోజే నాకు 20 సంవత్సరాలు సమయం ఇవ్వండి అని చాలా క్లియర్ గా చెప్పాడు. పది సంవత్సరాలు అయ్యింది. ఓపిక లేనివాళ్లు, అత్యాస ఉన్నవాళ్ళు, ఇమడలేనివారు వెళ్లిపోయారు. మొదటిరోజు నుండి జెండా పట్టుకుని కార్యకర్తలుగానే పని చేస్తున్న మాలాంటి (teluguchegu రూపంలో నేను) లక్షలాదిమంది అలాగే ఉన్నారు. మేము 20 సంవత్సరాలు వేచి చూడటానికి సిద్ధంగా ఉన్నాం. ఇక ఇబ్బందల్లా ఆత్రం తట్టుకోలేని అన్నీ మాకు తెలుసు అనుకునే కుహనా మేధావులతోటే....
వాళ్ళ కోసం కొన్ని వృత్తాంతాలు చూద్దాం...
గాంధీగారు స్వాతంత్ర్య ఉద్యమాన్ని దేశ వ్యాప్తం చెయ్యడానికి 30 సంవత్సరాలు పట్టింది. 1930లో ఉప్పు సత్యాగ్రహంతో మొదలు పెడితే 1947 కి స్వాతంత్ర్య౦ వచ్చింది. 1951లో జనసంఘ్ పెడితే 1977 లో జనతా పార్టీగా మారి 1980 లో భారతీయ జనతా పార్టీగా మారింది. 1984 లో 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ అధికారం రావడానికి 2019 వరకూ సమయం పట్టింది. అంటే 35 సంవత్సరాలు. అంత కాలం ఆర్‌ఎస్‌ఎస్ క్యాడర్ కఠోర దీక్షతో పని చేసారు. ఫలం సిద్దించింది. చాలా ఎక్కువగా ఉదాహరణగా చెప్పుకునే ఎన్టీఆర్ అధికారం కూడా ఎన్టీఆర్ పార్టీ పెట్టాక 9 నెలలే కావచ్చు, కానీ కాంగ్రెస్ ఏక ఛత్ర పరిపాలనకు 30 సంవత్సరాలు జరిగిన పోరాట ఫలితం అది. 100 గొడ్డలి పోట్లు అవసరం అయిన చెట్టుకి ఎన్టీఆర్ సమయానుకూలంగా చివరి గొడ్డలి పోటు సమయానికి రావడం వల్ల వెంటనే అధికారం దక్కింది. ఈ చరిత్ర ప్రభావంతో వాస్తవిక స్వభావంతో పవన్ కళ్యాణ్ చాలా ప్రాక్టికల్ గా పార్టీ పెట్టిన రోజే సమయం పడుతుంది అని క్యాడర్ కి చాలా స్పష్టంగా చెప్పాడు. ఆకాశంలో మేడలు కట్టేద్దాం అనే భరోసా ఇవ్వలేదు. ఈ సందర్భంలో చాలా డక్కా ముక్కీలు తిన్నాడు. షర్ట్ నలగడం కూడా కాస్ట్యూమ్ డిజైనర్ డిజైన్ చేసే స్థాయి నుండి ఇప్పుడు మానసికంగా శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతున్నాడు. తన డబ్బులు, తన సమయం తన శ్రమ పెట్టి పని చేస్తున్నాడని మర్చిపోయి ఇంట్లో టీవీ చూస్తూ, మొబైల్లో వార్తలు స్క్రోల్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు పోటీ చెయ్యాలో డిసైడ్ చెయ్యాలి అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ వాస్తవిక పరిస్థితుల్లో ఆడుతున్నాడు. మనం ప్రేక్షకుల్లా సినిమా చూస్తూ రివ్యూ ఇచ్చినట్లు జడ్జిమెంట్ ఇస్తున్నా. మన కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ కి మనం ఇచ్చే మద్దతు ఇదా??? ఒకసారి ఆలోచించండి... కల్ట్( డై హార్డ్ ఫ్యాన్) గా ఉన్న సినిమా అభిమాని కార్యకర్తగా మారాడా లేదా? మనం కల్ట్ కార్యకర్తలుగా ఉండలేమా? జగన్ లాంటి వాడిని రాష్ట్రంలో ఒక సమూహం మత్తు మందు తీసుకున్నట్లు సమర్థిస్తుంటే మనం చేస్తున్నది ఏంటి? సాధ్యాసాద్యాలు ప్రాక్టికల్ పరిస్థితులు తెలియని మనం పొత్తు అంశాలు నిర్దేశించాలి అనుకోవడం సమంజసమా? ఒకసారి ఆలోచించండి ???
మనం 30 పోటీ చేసాం 50 పోటీ చేసాం అనుకోవడం అవసరమా లేక జగన్ లాంటి దుష్టపరిపాలన అంతమొందించడానికి నాయకత్వం వహించింది మన నాయకుడు అనుకోవడం సంతృప్తికరమా???
నమ్మితే పోయేదేమి లేదు..
నమ్మేది నిఖార్సయిన నిజాయితీపరుడినే కదా.....
మన నాయకుడిని అనునిత్యం దెబ్బకొట్టాలి అని ప్రయత్నం చేస్తున్నవారు, సినిమా టికెట్లకు కూడా కలెక్టర్లుని పెట్టి అమ్మించినవారు, ఆ పార్టీకి చెందినవాళ్లు మన సీట్లు కోసం మనం ఎలా స్పందించాలో మనల్ని ప్రభావితం చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ భావనలోకి మనం వెళ్ళిపోదామా? సీట్లు గురించి మాట్లాడే ఎవరైనా సరే ఈ సీట్లో వైసీపీ నుంచి ఎన్ని వందల కోట్లు ఖర్చుపెడతారు? మన తరుపున వీడు ఉన్నాడు. దాన్ని ఎదుర్కొగలుగుతాడు వాడికి ఇచ్చుంటే బాగుండేది అనే సీట్లు ఎన్ని చూపించగలుగుతారు. Remember we are fighting with a monster.
ఇక ఈ డిమాండ్ చేసే కాపుల దగ్గరకి వద్దాం. అంత శాసించేవాళ్ళం అనుకునే సామాజిక వర్గం ఒంటరిగా వెళ్లిన చిరంజీవిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేకపోయింది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని MLA గా గెలిపించుకోలేని సామాజికవర్గ ముసుగు పెద్దలకు ఇన్ని సీట్లు అడుగు అని డిమాండ్ చేసే హక్కు ఎక్కడిది? పది మంది జనసైనికులు మధ్యలోనో లేక పది మంది కాపులు మధ్యలోనో కూర్చుని రాష్ట్రమంతా ఇలాగే ఉంది అనుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. సో కాల్డ్ కాపు నాయకులు పవన్ కళ్యాణ్ కి రాసే బహిరంగ లేఖలు సాక్షిలో హెడ్ లైన్స్ గా వస్తున్నాయి. అంటే ఆ లేఖలు ఎవరికి ఉపయోగపడుతున్నట్లు? ఈ సంక్షేమ నేతలు వారి నియోజకవర్గంలోనే పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి అనుకూలంగా కాపులను ఎందుకు ర్యాలీ చెయ్యలేకపోయారు? ఈ లేఖలు రాసే పెద్దమనుషులు పార్టీలోకి ఎంతమంది పెద్ద నాయకులను తీసుకొచ్చారు. పొత్తులో భాగంగా జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య పట్ల జనసైనికుల్లో అసంతృప్తి రాగాల్చాలి అనే వ్యూహం ప్రత్యర్థులు పన్నుతున్నారు. తద్వారా ఓటు బదిలీ జరగకుండా చెయ్యాలి అనేది వారి వ్యూహం. ఆ వ్యూహంలో ఎవరెవరు పాములు అవుతున్నారు? ప్రత్యర్థులు ఎంత విషం చిమ్ముతున్నారు. ఆ విషం ఎంతమందిలో నింపగలుగుతున్నారు. దానిలో మనమూ ఉన్నామా అనేది ఆలోచించుకోవాలి. తన పార్టీ ఎక్కువ సీట్లలో పోటీ చెయ్యాలని పవన్ కళ్యాణ్ కి మాత్రం ఉండదా? తన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చెయ్యాలో తనకంటే మనకే ఎక్కువ తెలుసా? అందరూ వాస్తవిక దృక్పధంలోకి రావాల్సి ఉంది. మనం బాధ్యతగా ఆలోచిస్తే మన టార్గెట్ రీచ్ అవుతాం కాని ఆవేశంగా ఆలోచిస్తే కాదు అని అర్ధం చేసుకుంటే మనకే మంచిది. సీట్లు తరువాత విషయం. జగన్ని ఓడించడం ముఖ్యం అనే లక్ష్యం కేంద్ర బీజేపీ పెద్దలను కూడా ఒప్పించిన పవన్ కళ్యాణ్ కి మనం ఇబ్బంది కాకూడదు.
చాలా కాలం తరువాత రాసాను. ఎవరినీ నొప్పించే చేసే ఉద్దేశం కాదు. తప్పులు ఉంటే మన్నించండి..
మీ ఆత్మీయుడు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com