
ఎన్ని ఒత్తిళ్ళు... బెదిరింపులు వస్తున్నా ధైర్యంగా నిలబడుతున్నది జన సైనికులే - శ్రీ పవన్ కళ్యాణ్ గారు...
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది... సమస్య ఉన్నా చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధిగా స్పందించేది మన జనసేన పార్టీయే... కాబట్టే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. భవిష్యత్తులో అధికారం అందుకోవాలి అంటే క్రియాశీలక సభ్యత్వం చాలా కీలకం... ప్రతి క్రియాశీలక సభ్యుడు కనీసం 50 మందిని ప్రభావితం చేసేలా ఉండాలని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పార్టీకి అండగా నిలబడే వ్యక్తిత్వం ఉండాలని సూచించారు. పార్టీకి ఉండే జనబలాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో గత ఎన్నికల్లో విఫలమయ్యాం... మళ్లీ అలాంటి తప్పులు జరగకుండా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామని అన్నారు. బుధవారం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమ ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ పి.ఎ.సి. ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, 32 నియోజకవర్గాల ఇంచార్జులు, రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కోసం పార్టీ ఐ.టి.విభాగం రూపొందించిన యాప్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ను పరిశీలించారు. శ్రీ మిరియాల శ్రీనివాస్ యాప్ గురించి వివరించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు నా దృష్టిలో ఉన్నాయి. ప్రతి సమస్యపై నేనే మాట్లాడాలి... ప్రతి ఊరికి నేనే రావాలని ప్రజల్లో ఉంటుంది. అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. రాష్ట్రంలో ప్రతి మూలకు వెళ్లి సమస్యలను ఎత్తిచూపాను కనుకే ప్రతి సమస్యపై స్పందించాలని ప్రజలు కోరుకుంటారు. కరోనా కష్టకాలంలో ముంబయిలో చిక్కుకుపోయిన వలస కూలీలు, గుజరాత్ తీరంలో, చెన్నై పోర్టులో మత్స్యకారులు ఇరుక్కుపోయినా జనసేన బలమైన గొంతు వినిపించి వారి ఆందోళనలను మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు ప్రభుత్వాలకు తెలిపాము. వెంటనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. స్వస్థలాలకు చేరుకున్నారు. త్రికరణశుద్దిగా పనిచేస్తాం కనుకే జనసేన గళం అంతగా ప్రభావితం చేస్తుంది.
జనసేన ప్రశ్నిస్తుంటే...
రాష్ట్ర విభజన సరిగా జరగలేదు. ప్రజలకు అన్యాయం జరగబోతుంది అని దూరదృష్టితో ఆనాడు మాట్లాడాను. 2014లో పార్టీ పెట్టినప్పుడు అప్పుడున్న పరిస్థితులకు తగట్టు ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పాం. ఆ స్లోగన్ ఆ సమయానికి రైట్. జనసేన ప్రశ్నిస్తుంటే మిగిలిన పార్టీలు అధికారం అనుభవించడానికి పార్టీ పెట్టలేదు. అధికారంలోకి వచ్చి ప్రజల కోసం నిలబడాలన్న బలమైన ఆకాంక్షతోనే పార్టీ పెట్టాను. 2024 కంటే ముందే మనకు ఎన్నికలు రావచ్చు. ఆ దిశగా మనం సన్నద్ధం కావాలి. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉన్నారని చెప్పుకొనే తెలుగుదేశం పార్టీ ఇవాళ ముందుకు వెళ్లడానికి ఎంతలా ఇబ్బందిపడుతుందో మనం చూస్తున్నాం. ఒక్క జనసైనికులు మాత్రమే ఎన్ని బెదిరింపులు, ఒత్తిళ్లు వచ్చినా ధైర్యంగా కాలర్ ఎత్తి నిలబడుతున్నారు. అలాంటి వారిని క్రీయాశీలక సభ్యులుగా తీసుకోండి. అన్ని రాజకీయ పార్టీలు సార్వత్రిక ఎన్నికల తర్వాత కార్యకర్తలను గాలికొదిలేస్తారు. జనసేన మాత్రం అలా ఎన్నటికి చేయదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాం.
జనసేన ప్రధాన స్రవంతిలోకి రండి :
పార్టీలో ఇమడకుండా జనసేన సపోర్టర్స్ అంటూ చిన్నచిన్న ఫ్లాట్ ఫామ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సొంత అజెండాలతో నేనంటే ఇష్టం అంటూ వేరే వేరే ప్లాట్ ఫామ్స్ రూపొందిస్తున్నారు. అలాంటి వాటిని దయచేసి ఎవరూ ప్రోత్సహించకండి. ఎవరికైనా పార్టీ ద్వారానే గుర్తింపు రావాలి. ఎవరొచ్చినా సరే జనసేనకి మద్దతు ఇవ్వాలి. అప్పుడు జనసేన కూడా మీతో నిలుస్తుంది. జనసేన ద్వారా చేస్తానంటే సంతోషంగానీ తమ విభాగాన్ని ప్రత్యేకంగా గుర్తించాలంటే ఎలా.? జనసేన పార్టీ ఉన్నదే ప్రజల కోసం నిలబడడానికి. మంచిపని చేస్తే ప్రోత్సహించండిగానీ వ్యక్తిగత అజెండాతో చేస్తే మాత్రం ప్రోత్సహించకండి. తమిళనాడుకు వెళ్లినా, కర్ణాటక వెళ్లినా తెలంగాణ మారుమూల ప్రాంతానికి వెళ్లినా నన్ను ఇష్టపడే అభిమాన జనం చాలా బలంగా ఉంటారు. కేవలం కొన్ని నియోజకవర్గాలకో, జిల్లాలకో పరిమితం అయిన వ్యక్తిని కాదు నేను. దయచేసి ఈ ఇండివిడ్యువల్ ప్లాట్ ఫామ్స్ నడిపే వ్యక్తులు దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని జనసేన మెయిన్ స్ట్రీమ్ లోకి రండి.
గడ్డాలు పట్టుకొని బతిమలాడను :
పార్టీలో కొంతమందికే ప్రాధాన్యత ఇస్తున్నామని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఒక విషయం చెబుతున్నా... నాయకులు నచ్చకపోతే మాకు హేతుబద్ధతతో తెలియచేయండి, మాట్లాడుతాం. అంతేగానీ ఎవరి చిత్తానికి వాళ్ళు పార్టీలో ఉన్న నాయకుల గురించి మాట్లాడేస్తామంటే కుదరదు. అలా మాట్లాడాలి అంటే జనసేన నుంచి బయటకు వెళ్లిపోయి మాట్లాడుకోండి. జనసేనలో ఉంటూ తిడితే మాత్రం కచ్చితంగా కుదరదు. ఒక వంద మంది వెళ్లిపోతే బలహీనపడే వ్యక్తిని కాను. వంద మంది వెళ్లిపోతే వెయ్యి మందిని తీసుకువస్తాం. గడ్డాలు పుచ్చుకుని బతిమలాడటం ఉండదు. రాజకీయాలు నాకేం సరదా కాదు. రాజకీయాలు నాకు బాధ్యత. ప్రతి ఒక్కరు ఇదే స్ఫూర్తిని తీసుకువెళ్లండి. జనసేన పార్టీకి బలమైన యువత బలం ఉంది. వారి మనోభావాలు గాయపర్చవద్దు. నేను ఒక్కడి బలాన్ని నమ్మను ఉమ్మడి బలాన్ని నమ్ముతాను. నేను ఒక్కడినే చేయాలని అనుకోను. సమష్టి కృషితోనే అది సాధ్యం. ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న నాయకుల్ని కలుపుకొని వెళ్లండి. రెండు వారాల్లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మద్యం, ఇసుక పాలసీలు, మరికొన్ని ముఖ్య సమస్యలపై సుదీర్ఘమైన చర్చ జరగాలి. భవిష్యత్తులో మన కార్యచరణ ఎలా ఉండాలి.... ప్రతి నియోజకవర్గంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చిస్తాం. దేశంలో ఏ పార్టీ ఇవ్వనంతగా క్రియాశీలక సభ్యులకు రూ. 5 లక్షల ఇన్సురెన్స్ సౌకర్యం కల్పించాం. ఈ ప్రక్రియ చేపట్టిన ఆడిటర్ శ్రీ ఎ.వి.రత్నం గారికి దన్యవాదాలు. క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని మీరంతా బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళండి” అని అన్నారు.
త్వరలో శిక్షణ తరగతులు: శ్రీ నాదెండ్ల మనోహర్ గారు :
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రతి నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతగా చేపట్టాలి. మంచి టీమ్ ని తయారు చేసుకోవాలి. వారే భవిష్యత్తులో మీకు అండగా ఉంటారు. వారిని రాజకీయంగా బలమైన శక్తిగా నిలపడానికి శ్రీ పవన్ కల్యాణ్ గారి సూచనల మేరకు పార్టీ తరఫున శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. క్రియాశీలక సభ్యత్వ నమోదు 5 నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతంగా జరిగింది. 175 నియోజకవర్గాల్లో ఒకటేసారి చేయగలిగే సత్తా ఉన్నా కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో జనసైనికులకు ఇబ్బంది కలగకుండా దశలవారీగా ముందుకు తీసుకువెళ్దామని శ్రీ పవన్ కల్యాణ్ గారు సూచించారు.
గ్రామ వాలంటీర్ల ద్వారా బెదిరింపులకు దిగారు :
పార్టీ సభ్యత్వం తీసుకొంటే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని వాలంటీర్ వ్యవస్థ ద్వారా బెదిరింపులకు దిగారు. ఇలాంటి ఒత్తిళ్లను, దాడులను తట్టుకుని శ్రీ పవన్ కల్యాణ్ గారి మీద విశ్వాసంతో ఇంత మంది సభ్యత్వం తీసుకున్నారు. రాజధాని ప్రాంతం మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాల్లో సైతం ఊహించిన దానికంటే ఎక్కువ సభ్యత్వాలు వచ్చాయి. నియోజకవర్గానికి 500 నుంచి వెయ్యి మంది క్రియాశీలక సభ్యులను తయారు చేసుకోగలిగితే వారంతా సైనికులుగా మారి పార్టీకి కుటుంబ సభ్యులుగా పోటీ చేసే అభ్యర్ధులకు అండగా ఉంటారని భావిస్తున్నాం” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు శ్రీ టి.శివశంకర్ గారు, శ్రీ సత్య బొలిశెట్టి గారు పాల్గొన్నారు.