' జనం కోసం నిజం చెప్పడమే జర్నలిజం' ప్రపంచమంతా వార్తా రూపంలో కళ్లకు కట్టినట్టు కనబరిచే అత్యంత బలమైన మాధ్యమం. మనిషిని సంఘంతో ముడిపెట్టి ఒక బలమైన సామాజిక అంశానికి పూనుకున్న ఉద్యమం జర్నలిజం. మన దేశం యొక్క ధర్మసూత్రం "సత్యమేవజయతే". అంతటి మహోన్నత ధర్మసూత్రాన్ని భుజస్కంధాలపై మోస్తున్న ప్రథమవర్గం జర్నలిజం. జనం బాగు కోసం వారిని చైతన్యపరచి స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను అందుకునేందుకు, కష్టనష్టాలను విశదపరచి ముందస్తు హెచ్చరికలు చేసేందుకు, మనిషికి మూడవ నేత్రంగా ప్రపంచాన్ని చూపించేందుకు, తప్పుదోవ పడుతున్న వ్యవస్థల అసలురంగును బయటపెట్టేందుకు సిద్ధమయ్యిందే జర్నలిజం.
ఇంతటి ఉన్నతమైన స్థానం కలిగిన ఈ వ్యవస్థలు ప్రజలకిగాని, దేశానికిగాని ఏ రకంగా ఉపయోగ పడుతున్నాయనేది పరికించి చూస్తే కనబడేవి గతం చేసిన త్యాగాలు, అమ్ముడుపోతున్న వర్తమానాలు, భవిష్యత్తును బలిపెడుతున్న రాజకీయ చదరంగాలు. ఆ చదరంగాన్ని దగ్గరుండి మరీ నడిపిస్తున్న వింతలు, విలువలకు పాతరేసిన విపరీతాలు. సామాజికకోణంలో ఆలోచిస్తే ఒక నిజాన్ని కప్పిపుచ్చి జరుగుతున్న అక్రమాన్ని గ్రహించిన ఒక వ్యక్తి జనబాహుళ్యంలో ఆ అక్రమ సంఘటనపై ప్రతిఘటనకు ప్రేరణయ్యేందుకో లేక మరోసారి అటువంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడేందుకో బాధ్యత తీసుకుని ముందస్తు హెచ్చరికని జారీ చేస్తున్న భాగమే జర్నలిజం, అదే వారి మొదటి సిద్ధాంతం. కేవలం జరిగిన అంశాలను ప్రచురించడానికో, లోకం తీరును చూపించడానికై ఉపయోగించే అతి స్వల్ప మాధ్యమంగా దీనిని భావిస్తే విలువలకు తిలోదకాలివ్వడమే కాకుండా అసలు ఉద్దేశ్యానికే సరితూగని విషయంగా పరిగణించాల్సి వస్తుంది.
శతాబ్దాల కాలంగా సాగుతున్న ఈ వార్తావిశేషాల సేకరణ, వాటిని ఒకచోట నుండి మరొక చోటుకు చేరవేసే విధానం, అతివేగంగా మారుతున్న కాలమాన పరిస్థితులు, సామాజిక, రాజకీయ, సాంప్రదాయ అంశాలు వాటి ఉనికిపై జరుగుతున్న వింతలూ, ఆయా దేశ వ్యవస్థల పనితీరు, ప్రపంచ, దేశ ఆర్థిక విధానాల వల్ల మనిషి మనుగడకు ఎదురయ్యే అంశాలు. అన్నీ తన వ్రాతలతో, మాటలతో తెలియపరిచే ఉన్నత సాధనం నేడు ఏమి చేస్తుందో చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. ఏ వ్యవస్థైనా మనుగడ సాగించాలంటే నమ్మకాన్ని కోల్పోకూడదు, అయితే ఇప్పటి పాత్రికేయత సత్యాన్ని అందించే విధంగా అడుగులు వేస్తోందా.. లేక సత్యాన్ని విస్మరించి మనుగడకు కొత్త దారులు వెతుకుతుందా..! ? ఈ పాత్రికేయత, వార్తామాధ్యమాల నిజాన్ని ఎలా సమాజానికి వడ్డిస్తుంది..!? లోతుగా చూస్తే వారు చేసే సామాజిక విధ్వంసం ఏమిటి..!? ప్రజలు ఏమి ఆశిస్తున్నారు..!? ప్రజాచైతన్యం విస్మరించి నేటి జర్నలిజం ప్రభుత్వాల, రాజకీయ పక్షాల ఉనికి పోరును తనపైన వేసుకుని వాటికి రంగులద్దుతూ సామాజిక సంక్షేమాన్ని విస్మరించి నడిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. కొన్ని మాధ్యమాలు నిజాయితీగా వ్యవహరిస్తున్నా ఆ శాతం చాలా తక్కువని చెప్పవచ్చు. ఊహలను నిజాలుగా, జరుగుతున్న విషయాలు వారికి లాభదాయక మైతే.. పక్షపాత ధోరణితో మంచిపనిగా చిత్రీకరిస్తూ చేసే చర్యలతో నేటి జర్నలిజం అక్రమాలకు, కుట్రదారులకు వెన్నుదన్నుగానూ నిలుస్తూ కొందరి పక్షాన నిలబడి జరుగుతున్న అన్యాయాన్ని కాక ఏ మోసంతో వారు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారో ఆ మోసాన్ని గొప్పగా, మంచికి జరిగే అంశంగా చూపిస్తూ సామాజిక బాధ్యతను పూర్తిగా విస్మరిస్తుంది. ఈ చర్యలే వ్యవస్థలను నడిపించే వారి మీద ఒక అంచనాకు రాలేని పరిస్థితిని తీసుకువస్తున్నాయి. పూర్తిగా ప్రజల ఆలోచనను చంపేస్తూ సందిగ్ధంలోనికి నెట్టేస్తున్నాయి. ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉన్నా పాలకుల ఉనికి, అవినీతి సామ్రాజ్యాల విషవలయం అందుకు సన్నద్ధంగా లేదు. జవాబుదారీతనంలేని పాలకులను ప్రశ్నించాల్సిన, అ జరుగుతున్న అంశంపై లోటుపాట్లు ప్రజలు గమనిస్తున్నారనే ఆలోచన కల్పించాల్సిన వారే స్వార్ధంతో నిజాన్ని కప్పేయడం వెరశి సమాజానికి అన్యాయం చేస్తున్నాయి.
ప్రసారమాధ్యమాలు మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో మార్పులకులోనయ్యాయి. గతంలో ఈ వార్తలన్నీ కాగితాలపై ముద్రణ ద్వారా ప్రచురితమయ్యేవి. ఇప్పుడవి పూర్తిస్థాయి వార్తా మాధ్యమాలుగా దృశ్యాలను కూడా ఎప్పటికప్పుడు చూపించగలిగేవిగా రూపాంతరం చెందాయి. కానీ గతంలో చూపించిన విలువలు మాత్రం చూపించ లేకపోతున్నాయనడంలో సందేహమే లేదు. 24 గంటలూ వార్తావిశేషాలను ప్రచారం చెయ్యడానికి తగినన్ని అంశాలు ఉండాలి కదా..!! ఈ 24 గంటల ప్రసార మాధ్యమాలు మొదలైనప్పటినుండీ జరుగుతున్న వింతలు వ్యక్తపరచడానికి సామాన్యుడి శక్తి సరిపోదనడంలో అతిశయోక్తిలేదు. వ్యక్తులు వారి జీవితాలను కూడా వార్తాంశంగా మారుస్తూ వారి మానసికస్థితిపై అలజడి రేపుతున్న ఈనాటి పాత్రికేయ విలువలు సామాన్యుడికి ఒక పట్టాన అర్థం కావు.
ఎక్కడ అవినీతి విజృంభిస్తుందో అక్కడ వారి ఎదుగుదలకు బాటలు వేసుకునే చర్యలు ఈ వార్తామాధ్యమాలు చేపడుతున్నాయనే లోగుట్టు కూడా ప్రజలలో బలంగానే నాటుకు పోయింది. వ్యక్తిత్వహననం, అసాంఘిక కార్యక్రమాలపై విస్తృతమైన ప్రచారం, వార్త యొక్క నిడివిపై, ప్రసారంపై ఏ విధమైన నియంత్రణ లేకపోవడం ఇలా ఎన్నో అంశాలు ఆ 24 గంటల యొక్క జరుగుబాటుకి అందిన విశేషాలుగా పరిణమించాయి. జర్నలిజం యొక్క నైతికతపై నీలిమేఘాలు కమ్ముకుంటున్న ఈ క్రమంలో జరిగిన/జరుగుతున్న సంఘటనల పైన వాటి యధార్ధ పరిస్థితులపై కూడా అనుమానాలు వ్యక్తపరిచే రోజులు వచ్చాయి.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రభుత్వాలే వారి పరిపాలనను పొగుడుకునేందుకు అంతా బ్రహ్మాండంగా జరుగుతుందని నమ్మబలికేందుకు, వచ్చే రోజులన్నీ అభివృద్ధికి తార్కాణాలుగా అభివర్ణిస్తూ ఎవరి బాకా వారు ఊదుకుంటున్నారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఇరువురూ ఈ సొంత బాకాను ఊదుకోవడంలో పోటీపడుతూ అసలు నిజాన్ని పక్కదోవపట్టిస్తూ ప్రజల్ని వెర్రి వారిని చేస్తున్నారు. ఈ ప్రసారమాధ్యమాల తోడులేని వారి సామాజిక సేవ, చైతన్య దృక్పథం పూర్తిస్థాయిలో ప్రజలలోకి వెళ్లడానికి అవకాశాలు ఉండడం లేదు. కొన్ని సాంఘిక ప్రసారమాధ్యమాల వల్ల తెలియపరుచుకునే అవకాశం కలిగినా అది జనంలోకి చేరేందుకు సమయం పడుతుంది. ఫలితాలు ఆశించినంతగా ఉండడం లేదు.
ప్రభుత్వాలు జనానికి కల్పించాల్సిన ఉపాధి అవకాశాల మీద కాక వారు పన్నుల రూపంలో వసూలు చేసి తిరిగి వాటితోనే జనాకర్షక పథకాలతో విస్తృత ప్రచారం కల్పించుకుని నెట్టుకొస్తున్నారు. పూర్తిగా వ్యాపార ధోరణిలో మారిపోయిన ఈ వార్తా ప్రసారమాధ్యమాల నుండి జనం కోసం, వారి చైతన్యం కోసం ఏదో చేస్తారనుకునే రోజులు అడుగంటిపోతున్నాయి. నియంత్రణ లేకపోవడం, వారిని ఎదురుతిరిగే పరిస్థితులు లేకపోవడం వల్ల నేటి జర్నలిజం వారి అర్థికస్థితిని మెరుగుపరుచుకొనే విషయాన్ని ముడిపెట్టుకుని సమాజాన్ని కోలుకోలేని స్థితిలోనికి నెట్టివేస్తున్నారు. అరకొరగా స్వాతంత్ర్య ఫలాలను అందించాలనుకునే వారి ప్రతిఘటన అడవిలో ఆక్రందనగా మిగిలిపోతుంది. అవినీతి సామ్రాజ్యాల నిర్మాణాలకు వంతపాడుతూ సాగుతున్న ఈ జర్నలిజం నిజం వైపు నిలబడి సమాజాన్ని కాపాడుకోవాలి.. లేకుంటే మొదటి ముద్దాయిగా చరిత్రలో చెప్పుకోకపోయినా వారి మనసుల్లో దోషులం తామేనని దూషించుకుంటూ మిగిలిపోతారు.
ఇప్పటికైనా మనదేశ వార్తాప్రసార మాధ్యమాలు జాతి ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి కంకణం కట్టుకోకపోతే.. పూర్తిగా నిర్వీర్యమైపోయిన సమాజంలో వారి ప్రచారాలు, ప్రయాసను ఎవరూ గుర్తించలేరు. మేలుకోకపోతే ముప్పుతప్పదు. గతం చెబుతున్న చరిత్రల అవేశాన్ని నింపుకుని సమాజంకోసం బలమైన వేదికగా ఈ మాధ్యమాలు నిలబడాలి. ప్రజలకోసం తామున్నామని అన్యాయంపై కలబడాలి.
భాను శ్రీమేఘన..
భానుడు (ట్విట్టర్ ఐడి) : @ravikranthi9273
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com