నెల్లూరు, మార్చి 31 (జనస్వరం) : ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తున్న అమరావతి రాజధానికి చట్టబద్ధత లభించడం చారిత్రాత్మక ఘట్టమని జనసేన నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర కార్యాలయ సూచనల మేరకు అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఆయన విగ్రహం వద్ద దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అమరావతి రాజధానికి మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ, అమరావతి కోసం ఎన్ని ఆటంకాలు వచ్చినా అది ఒక్కటే రాష్ట్ర రాజధానిగా ఉండాలని ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. రాజకీయ లాభనష్టాలను పక్కనబెట్టి రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. రాజధాని నిర్మాణంలో రైతులు తమ భూములను భవిష్యత్ తరాల కోసం ఇచ్చారని, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా లోకసభ, రాజ్యసభల్లో ఆమోదం రావడం రాష్ట్రానికి గౌరవకారణమని తెలిపారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతి అంశంపై గత ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ, “మూడు రాజధానులు” ప్రతిపాదనతో రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టారని ఆరోపించారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్‌తో పాటు నూనె మల్లికార్జున యాదవ్, చిట్టమూరి ప్రవీణ్ రెడ్డి, పప్పు నారాయణ, జమీర్, శివకృష్ణ నక్కల, సాయి, హేమచంద్ర, నాగేంద్రబాబు, శరవణ, సుధా మాధవ్, పేనేటి శ్రీకాంత్, గుత్తి శ్రీకాంత్, వర్షన్, ప్రతాప్, సురేష్, కరీం, ప్రసన్న, ఉదయ్, కృష్ణవేణి, మోపురు నందిని, లత, ప్రవళిక, రుక్మిణి తదితరులు హాజరయ్యారు.