నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని 177వ రోజున 42వ డివిజన్ ఖుద్ధూస్ నగర్ 5వ వీధిలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇసుక మాఫియా ఆగడాలు మూడేళ్ళలో విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు. పెన్నా నదిని ఇష్టప్రకారం తవ్వేస్తూ గుల్ల చేస్తున్నారని, గతేడాది నెల్లూరు సిటీ, కోవూరులోని పలు ప్రాంతాలు మునిగిపోవడానికి కారణం ఈ వైసీపీ ఇసుక మాఫియానే అని అన్నారు. ఇసుక మాఫియాని తయారు చేసిన వైసీపీ కారణంగానే గతేడాది అన్నమయ్య డ్యామ్ పగిలిపోయిందని, సోమశిల ప్రమాదంలో పడిందని, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వైసీపీ ఇసుకాసురులు రెచ్చిపోతున్నారని, ఇసుక మాఫియాను ఆపకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని అన్నారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఈ ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ ప్రతి నెలా కోట్లు గడిస్తున్నారని, గతేడాది నగరం మునిగిపోవడానికి కారణంగా నిలిచారని, ఈ ఏడాది కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదని, నమ్మి ఓట్లేసిన ప్రజలంటే అనిల్ కు లెక్కే లేదని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలంతా వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో గెలిచేది జనసేన పార్టీనే అని, తాము గెలిచాక పెన్నా నది పరిరక్షణ చర్యలు చేపడతామని, ఇసుక మాఫియాకి అడ్డుకట్ట వేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.