Search
Close this search box.
Search
Close this search box.

రోడ్ల నిర్లక్ష్యత – అసమర్థ వైసీపీ ప్రభుత్వం

వైసీపీ

       ప్రాంతాలను కలిపే వారధులు, అభివృద్ధికి సంకేతాలు, రవాణా వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించేవి రహదారులు. గ్రామ స్థాయి నుండి పట్టణ ప్రాంతాల వరకు వివిధ రకాలుగా రోడ్డు సౌకర్యం ఉంటుంది. జనం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లేందుకు సాధారణంగా రోడ్డు ప్రయాణమే చేస్తుంటారు. సాధారణ రోడ్ల నుండి జాతీయ రహదారుల వరకు ప్రజలకి కావాల్సింది సౌకర్య వంతమైన ప్రయాణం. రాష్ట్రాల పరిధిలో ఏ ప్రభుత్వం ఏర్పడిన రవాణా శాఖకు సంబంధించిన రోడ్లు మరియు భవన నిర్మాణ శాఖ ద్వారా రహదారుల నిర్మాణం, పునర్నిర్మాణం, మరమ్మత్తులు జరుగుతాయి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో టెండర్లు జరిపి కాంట్రాక్టర్లకు అప్పగించటం ద్వారా ప్రభుత్వ అజమాయిషీతో పని పూర్తి చేసిన తర్వాత బిల్లులు చెల్లిస్తారు ప్రత్యేక వ్యవస్థ ఉండి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి విభజన ద్వారా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంతో పోల్చుకుంటే అభివృద్ధిలో వెనుకబడి ఉంది ఆంధ్రప్రదేశ్. రహదారుల విషయం అయితే పాలకుల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రవాణా వ్యవస్థలో ముఖ్యమైన రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోయాయి.

        ప్రయాణం అంటే ప్రమాదకరంగా, భయానకంగా మారిపోయింది, రాత్రి ప్రయాణాలైతే ఎప్పుడు రక్తసిక్తంగా మారుతాయో ఊహించలేము, ప్రమాదాల వల్ల గాయాలు అవుతున్నాయి, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎన్నో విషాదాలు జరుగుతున్నా, ప్రమాదాలు ప్రజల ప్రాణాలను ఉసురు పోసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రవాణ వ్యవస్థ ఇలాంటి దయనీయ స్థితిలో ఎప్పుడూ లేదు. ప్రయాణంలో ‘పదనిసలు’ అని సరదాకి చెప్పుకునే సామెతను నిజం చేస్తోంది ఈ ప్రభుత్వం. రహదారుల నిర్మాణం జరిగినప్పటి నుండి నిర్వహణకు ప్రత్యేక విభాగం ఉంటుంది. ఎక్కడ ఇబ్బంది ఏర్పడినా వెంటనే సరిచేసే వర్క్ ఛార్జ్ సిబ్బంది ఉండి పర్యవేక్షిస్తూ మరమ్మత్తులు చేసేవారు ఆ విధానానికి నిధులు కేటాయించకుండా రద్దు చేసేశారు. ఆ విభాగమే లేకపోవడం పర్యవేక్షణ జరగక పోవడం వల్ల ఒకసారి ఏర్పడిన గుంతలు గొయ్యిలుగా మారుతున్నాయి. రహదారులు ఛిద్రమైన ప్రజలు చేసే ప్రయాణాలలో భద్రత లోపించింది. ప్రయాణాన్ని దుర్భరంగా మార్చేస్తున్న రోడ్లు ఆంధ్రప్రదేశ్ అంతటా సగానికి పైగా ఉన్నాయి. ఎన్నో వినతులు ఇస్తే తప్ప కొద్దిపాటి మరమ్మత్తులు చేయలేని పరిస్థితి, సరి చేసేందుకు కాంట్రాక్టర్లకు ఇచ్చినా పర్యవేక్షణ లేక తూతూ మంత్రంగా వేసి చేతులు దులుపుకుంటున్నారు, ఎప్పుడో ఇచ్చే బిల్లులకు, వస్తాయో రావో తెలియని బిల్లుల కోసం ఎవరు మాత్రం ఆసక్తి చూపిస్తారు. ఆదాయం కోసం పని చేసే కాంట్రాక్టర్లు లాభం మాత్రమే చూసుకుంటారు అది వాళ్ల తప్పు కాదు. విస్తీర్ణం ఎక్కువ ఉన్న, జనాభా 4.50 కోట్లకు మించి ఉన్న రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి లేదు. చెప్పుకోవడానికే లెక్కల్లో చేశామని చెపుతున్న కాకి లెక్కలు వేల కోట్ల రూపాయల ఖర్చు చూపిస్తున్నాయి తప్ప, వేసిన రహదారులను కానీ పునర్నిర్మాణం చేసిన దారులను కానీ కాగితాల్లో చూసుకోవాల్సిందే. “ప్రచారం మెండు – పనులు పెండింగు” ఈ ప్రభుత్వం తీరు. పైగా జాతీయ రహదారులను చూపించి తాము చేసిన అభివృద్ధి అని డప్పు కొట్టుకుంటున్నారు.

           ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రహదారులన్నీ కలిపి 53,403 కి.మీ పొడవుగా 2018 లో లెక్కించారు అందులో జాతీయ రహదారులు 6,401 కి.మీ.పొడవు, రాష్ట్ర రహదారులు 14,722 కి.మీ. పొడవు, జిల్లా రహదారులు 32,280 కి.మీ. పొడవు ఉన్నాయి. ఇంత పెద్ద రవాణా వ్యవస్థలో రహదారుల నిర్వహణకు సమన్వయం చేసుకోవలసిన శాఖల పనితీరు లోపం వల్ల జరగవలసిన పనులు సమయానికి జరగటం లేదు. కాలపరిమితిని బట్టి చేయాల్సిన నిర్వహణ కొరకు, మరమ్మతులకు నిధులు కేటాయించడం లేదు నిర్వహణ లేమి వల్ల గోతులు ఏర్పడి రహదారులన్నీ జీర్ణావస్థకు చేరుకొని కొత్తగా రహదారులు వేయాల్సిన పరిస్థితి. దాదాపు 30 వేల కి. మీ విస్తరించిన రహదారులన్నీ మూడేళ్ళుగా పట్టించుకొనే వ్యవస్థ లేక ప్రయాణించటానికి వీలు లేనంత గోతులతో దుర్భరంగా మారిపోయాయి.
          ఒకప్పుడు కాంట్రాక్టుల కోసం ఎగబడే వారు ఎదురు లంచాలు ఇచ్చి తమకు వచ్చేలా ప్రయత్నించే వాళ్లు ఇప్పుడు టెండర్లు వేయాలంటే ఎవరూ ముందుకు రావట్లేదు అంటే ఎంత దీనస్థితికి ఈ విభాగం వెళ్లిపోయిందో ఊహించవచ్చు. సంక్షేమ పథకాలు అంటూ ఉచితాల కోసం అభివృద్ధి అనే పదాన్ని వెనక్కి నెట్టేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మౌలిక సదుపాయాలైన రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేయకుండా రహదారుల మీద నడిచే త్రిచక్ర వాహనాలకు వాహన మిత్ర పేరుతో 10 వేల రూపాయలు ఇవ్వటం, రోడ్ల సెస్సు పెంచి, ఆర్టీసి చార్జీలు పెంచి సామాన్యులకు సౌకర్యాలు కల్పించకుండా అదనపు భారాన్ని మోపటం ఒక చేత్తో ఇచ్చి పన్నుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితి. అధ్వాన్నంగా మారిన రహదారుల విషయమై గత సంవత్సరం జనసేన పార్టీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపి ప్రశ్నించారు. మళ్ళీ రహదారుల కోసం గళం ఎత్తారు. నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని మేలుకొలుపుతున్నారు.   

– టీం నారీస్వరం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way