మంగళగిరి, మార్చి 22 (జనస్వరం) : మూడు దశాబ్దాల ముందుచూపుగల విజనరీనేత చంద్రబాబు విశ్వం మెచ్చిన నాయకుడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, కాలమిస్ట్ నల్లాని రాజేశ్వరి నిర్మించిన పాట వీడియో సిడిని శుక్రవారం మంగళగిరిలో ఆయన ఆవిష్కరించారు. చంద్రబాబు ఔన్నత్యంపై అద్భుతగీతం రూపొందించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా పాటలోని సంగీతం, సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు నాయుడి స్ఫూర్తివంతమైన నాయకత్వం, ఆదర్శ వ్యక్తిత్వం గురించి తనదైన ఆలోచనతో నిర్మాత నల్లాని రాజేశ్వరి విసిడి రూపొందించారు. ప్రముఖ కవి, కళారత్న బిక్కి కృష్ణ రాసిన గీతానికి సినీ సంగీతదర్శకులు చిన్ని కృష్ణ చక్కని బాణీలను సమకూర్చారు. ఆకట్టుకునే సంగీతం, చైతన్యవంతమైన గానం, అర్థవంతమైన సాహిత్యంతో పాట అందరి హృదయాల్లోకి దూసుకెళ్లి బహుళప్రచారం పొందుతుందని నిర్మాత రాజేశ్వరి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై ఫౌండేషన్ సిఇఓ గుత్తా హరిసర్వోత్తమ నాయుడు పాల్గొన్నారు.