అనంతపురం, ఫిబ్రవరి 8, (జనస్వరం) : దేశ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని, అలాగే ఆయన ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరక నాగేంద్ర యాదవ్ తన స్వగృహంలో ప్రత్యేక దేవి హోమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. దేవి హోమంలో అనుభవజ్ఞులైన వేద పండితులు పాల్గొని శాంతి హోమాలు, మంత్రోచ్చారణలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీపై దేవీ కృప ఎల్లప్పుడూ ఉండాలని, దేశ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని, భారతదేశం ప్రపంచంలో మరింత శక్తివంతంగా ఎదగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హోమ కార్యక్రమంలో భాగంగా కలశ పూజ, పూర్ణాహుతి తదితర వైదిక క్రతువులు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మరక నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్న ప్రధానమంత్రి ఆరోగ్యం, భద్రత ప్రతి భారతీయుడి బాధ్యత అని, అందుకే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై, ప్రధాని దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హోమం అనంతరం ప్రసాద వితరణ జరిగింది. మొత్తం కార్యక్రమం ప్రశాంతతతో, ఆధ్యాత్మిక శక్తితో నిండిన వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.