అమరావతి, (జనస్వరం) : “రోడ్ల మధ్య గుంతలు ఉన్నాయా? గుంతల మధ్య రోడ్లు ఉన్నాయా? అన్న అధ్వాన స్థితిలో రహదారులు ఉన్నాయి. కేవలం సంక్షేమం నినాదంతో ప్రజలను ఈ ప్రభుత్వం మోసగిస్తోంది. మౌలిక సౌకర్యాల కల్పనను పూర్తిగా విస్మరించింది. అందుకే జనసేన ప్రజల పక్షం వహిస్తూ సెప్టెంబరు 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలోని రోడ్ల దుస్టితిపై డిజిటల్ ఉద్యమం నిర్వహించనుంది. పార్టీ క్రియాశీల కార్యకర్తలు, వీర మహిళలు ఆ మూడు రోజుల్లో రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని ‘జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఫోటోలు, వీడియోల రూపంలో డిజిటల్ వేదికలపై పోస్టులు చేస్తారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే అక్టోబరు 2న రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక రోడ్డును ఎంచకుని మా కార్యకర్తలు శ్రమదానంతో బాగుచేస్తారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల పాల్గొంటారు” అని జనసేన పార్టీ (జేఎస్పీ) రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ “రోడ్డ మరమ్మతులను రెండేళ్లుగా వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసింది. బడ్జెట్‌లో రూ.12,450 కోట్లు కేటాయించినట్లు చూపుతోంది. ఎక్కడా తట్టెడు మట్టి వేసిన దాఖలాలులేవు” అని మనోహర్ గారు విమర్శించారు. ప్రకాశంజిల్లా, గిద్దలూరు నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిపై ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు జన సైనికుడు వెంగయ్యనాయుడును మానసికంగా వేధించి అతను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకువచ్చారని ఆరోపించారు. తాము భాజపాతో కలిసే సాగుతున్నామని, పలు కార్యక్రమాలపై సమన్వయ కమిటీ సమావేశమూ జరిగిందన్నారు.