– గ్రామగ్రామాన జనసేన జెండా రెపరెపలాడాలి
– జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు
అమరావతి, (జనస్వరం) : గ్రామ గ్రామాన జనసేన జెండా రెపరెపలాడాలనీ, భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. జనసేన ముందు ఏ పార్టీ నిలబడదని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఎన్నికలో గెలిచే విధంగా పార్టీని బలోపేతం చేసేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. ప్రతి కార్యకర్తకు ధైర్యం ఇస్తూ, భరోసా కలిగించేలా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని చెప్పారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండల పరిధిలోని గామాలపాడులో ఏర్పాటు చేసిన జనసేన జెండా స్థూపాన్ని ఆవిష్కరించారు. పార్టీ తరపున విజయం సాధించిన సభ్యులను అభినందించారు. అనంతరం దాచేపల్లిలో కోవిడ్ సమయంలో మృతి చెందిన కార్యకర్తలకు నివాళులు అర్పించారు. పార్టీని బలోపేతం చేసే క్రమంలో జనసైనికులు, వీరమహిళల కృషిని అభినందించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ “గ్రామ స్థాయిలో జనసేన పార్టీ బలంగా ఉంది. పల్నాడు ప్రాంతంలో వీరమహిళలు, జనసైనికులు ఈ విధంగా ముందుకు రావడమే అందుకు నిదర్శనం. భవిష్యత్తులో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేద్దాం. ప్రతి కార్యకర్త పార్టీ కోసం కొంత సమయం కేటాయించాలి. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలని ముందుకు తీసుకువెళ్లాలి. జనసేన పార్టీ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది.? పవన్ కళ్యాణ్ లాంటి మంచి నాయకుడి వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందనే విషయాలను ప్రజలకు వివరించాలి. ఇదే విధంగా ప్రతి గ్రామంలో, మండలంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే మంచి ఫలితాలు వస్తాయి. కరోనా సమయంలో పార్టీ ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయింది. అలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కార్యకర్తలకు అండగా నిలబడడం కోసమే పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఏర్పాటు చేసి దేశంలో మరే పార్టీ ఇవ్వని విధంగా రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి వారి కుటుంబాలను ఆదుకుంటున్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నేతలు బోని పార్వతీ నాయుడు, బిట్రగుంట మల్లిక తదితరులు పాల్గొన్నారు.