- ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమం
- సీఎంపీవోలు, వీసీపీసీ సభ్యులతో సమీక్ష సమావేశం
- శాఖల సమన్వయం, గ్రామ స్థాయి పర్యవేక్షణపై దృష్టి పెట్టాలని సూచన
ఏలేశ్వరం, జూలై 23 (జనస్వరం): కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో పట్టణ, గ్రామీణ మండలాల పరిధిలో టీనేజ్ గర్భధారణలు, బాల్య వివాహాల నివారణ, బాలల రక్షణ చట్టాలపై ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమీక్ష, అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారి పద్మావతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మండల స్థాయి బాల్య వివాహాల నిరోధక, పర్యవేక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీనేజ్ గర్భధారణలు, బాల్య వివాహాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, శాఖల మధ్య సమన్వయం, గ్రామ స్థాయిలో పర్యవేక్షణ, అనుమానాస్పద బాల్య వివాహాలను వెంటనే గుర్తించి అడ్డుకునే విధానాలు, సంబంధిత చట్టాల అమలు, ప్రజల్లో అవగాహన కల్పించే కార్యాచరణపై సమీక్ష నిర్వహించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి మాట్లాడుతూ, బాల్య వివాహాల నిషేధ చట్టం, బాలలపై లైంగిక నేరాల నిరోధక (పోక్సో) చట్టం, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ నిషేధ చట్టం, లింగ వివక్ష నిరోధక నిబంధనలు, బాలల హక్కుల పరిరక్షణ చట్టాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, బాల్య వివాహాల నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత సహాయవాణి నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె. కీర్తి, మండల అభివృద్ధి అధికారి రామరాజు వర్మ, వైద్యులు సౌమ్య, నాగలక్ష్మి, జయరాం, న్యాయవాది అవసరాల దేవి, నాయకులు అలమండ చలమయ్య, బొదిరెడ్డి గోపి, పెంటకోట మోహన్, చిక్కాల లక్ష్మణరావు, పసల సూరిబాబు, కొప్పుల బాబ్జి, మండల విద్యాశాఖ అధికారి అబ్బాయి, నగర పంచాయతీ కమిషనర్, మండల స్థాయి అధికారులు, గ్రామ అభివృద్ధి అధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, సహాయ నర్సులు, గ్రామ స్థాయి సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
