గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ రైతులకు రూ.1.94 లక్షల కోట్ల కేసీసీ రుణాల
- సవరించిన వడ్డీ రాయితీ పధకం కింద 1.04 కోట్లు కేసీసీ రుణ ఖాతాలకు ప్రయోజనం
- కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడి
- సవరించిన వడ్డీ రాయితీ పథకం క్రింద జారీ చేసిన కిసాన్ క్రెడిట్ కార్డులపై ప్రశ్నించి ఎంపీ కేశినేని శివనాథ్
ఢిల్లీ, డిసెంబర్ 2 (జనస్వరం ప్రత్యేక ప్రతినిధి) : ఆంధ్రప్రదేశ్‌లో సవరించిన వడ్డీ రాయితీ పథకం (MISS) కింద గత మూడు సంవత్సరాల్లో రైతులకు భారీగా లాభం చేకూరింది. 2022–23, 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి మొత్తం 1.04 కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) రుణ ఖాతాలు వ్యవసాయ పనుల కోసం ఆర్థిక సహాయం పొందాయి. ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రానికి మొత్తం రూ1.94 లక్షల కోట్లకు పైగా రుణాలు కె.సి.సి ల ద్వారా మంజూరయ్యాయని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ వెల్లడించారు. లోక్ సభలో మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్ గత మూడేళ్లలో సవరించిన వడ్డీ రాయితీ పథకం క్రింద జారీ చేసిన కిసాన్ క్రెడిట్ కార్డుల వివరాలు, రుణాల మంజూరు గురించి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖను ప్రశ్నించగా,కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఏపీలో 2022–23లో రూ.60,883 కోట్లు, 2023–24లో రూ65,454.76 కోట్లు, 2024–25లో రూ.68,002.71 కోట్లు రుణాలుగా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. సవరించిన వడ్డీ రాయితీ పథకం పథకం కింద సమయానికి రుణ చెల్లింపు చేసిన రైతులకు ఇచ్చే పి.ఆర్.ఐ (Prompt Repayment Incentive) కూడా భారీ సంఖ్యలో రైతులకు అందినట్లు తెలియజేశారు. ఈ మూడు సంవత్సరాల్లో మొత్తం 50,95,217 మంది రైతులు పి.ఆర్.ఐ రాయితీ ద్వారా లాభం పొందారని వివరించారు. పి.ఆర్.ఐ రాయితీ మూలంగా రైతులు చెల్లించే వడ్డీ రేటు 7% నుండి 4%కు తగ్గి వారికి పెద్ద ఉపశమనం లభించిందన్నారు. రైతులపై వడ్డీ భారాన్ని తగ్గించడంతో పాటు, సమయానికి రుణ చెల్లింపును ప్రోత్సహించే దిశగా సవరించిన వడ్డీ రాయితీ పథకం రాష్ట్ర వ్యవసాయ రంగానికి బలాన్నిచ్చే విధంగా పనిచేస్తోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. జిల్లాల వారీ గణాంకాలను పరిశీలిస్తే అనంతపురం, కర్నూలు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి , శ్రీకాకుళం జిల్లాలు కె.సి.సి రుణ వినియోగంలో అగ్రస్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. వీటిలో అనంతపురం జిల్లా మూడు సంవత్సరాల్లో 15 లక్షలకు పైగా కె.సి.సి రుణ ఖాతాలతో రాష్ట్రంలో అగ్రస్థానంలో వుందన్నారు. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు పెరుగుతున్న సందర్భంలో రైతులకు తక్కువ వడ్డీతో తక్షణ రుణాలను అందించడంలో సవరించిన వడ్డీ రాయితీ పథకం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ స్పష్టం చేశారు.