প্রিন্ট এর তারিখঃ ডিসেম্বর ২৬, ২০২৪, ২:৫২ এ.এম || প্রকাশের তারিখঃ এপ্রিল ১২, ২০২১, ১২:০৮ পি.এম
సినిమా
ఈ రోజు, సినిమా వినోదాత్మకతకు, అత్యంత ఇష్టమైన, శక్తివంతమైన మాధ్యమాలలో ఒకటిగా మారింది. ఒక సంస్కృతిని అభివర్ణించడంలో గానీ, విమర్శించడంలో గానీ లేదా సమకాలీన సమస్యను పరిష్కరించడంలో గానీ సినిమాలు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాయి. భారతీయ సంస్కృతి, భారతీయ ప్రజల ఆలోచనా, సినిమా వీరు కాదు అని చెప్పినా అతిశయోక్తి లేదు. వినోదాత్మక అనగానే మనకు ముందు గుర్తొచ్చేది సినిమా. సినిమా ఎక్కువ శాతం ప్రజల జీవితాల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఒక పెద్ద వేదికగా ఖ్యాతిగాంచింది.
దిన దిన ప్రవర్తమానం చెందుతూ, కథలను కూరుస్తూ, ప్రజల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త కథలతో మొదట భారతీయ చిత్రమైన “హరిశ్చంద్ర” సినిమా నుంచి శతాబ్ధ కాలంలో ఎన్నో ఓనమాలు నేర్చుకుంటూ, వినోదాన్ని పంచుతూ, ఆలోచనలను రేకెత్తిస్తూ, దేశ భక్తిని పెంపొందిస్తు నవరసాలను తనలో మమేకం చేసుకుని ప్రపంచంలోనే మూడవ అత్యంత ప్రసిద్ధి గాంచిన భారతీయ సినిమాని చూసి అందరం గర్వపడాలి. సినిమాల ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు...
ఉదాహరణకు రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన “మగధీర” అనే సినిమాని చూసుకుంటే అందులో శ్రీహరి పోషించిన “షేర్ ఖాన్” అనే పాత్ర మరణించి శ్రీకాకుళంలో సల్మానుగా మళ్లీ జన్మిస్తారు. అసలు నిజంగా షేర్ ఖాన్ అనే రాజు ఉన్నాడా అనే కుతూహలంతో అంతర్జాలంలో వెతకగా తెలిసిన విషయం ఏమిటంటే షేర్ ఖాన్ అనే రాజు నిజంగా శ్రీకాకుళంనీ పాలించాడు. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత పెద్ద మసీదు ఆయనే కట్టాడు. ఇదే కాదు బాహుబలి మనందరికీ ఒక వినోదాత్మక చిత్రం. కానీ బాహుబలి ఎవరు?? అని అన్వేషించే కర్ణాటకలో ఉన్న “బాహుబలి” జైన గురువు గురించి తెలిసింది. అలాగే KGF బంగారు గనులు గురించి, ఇలా చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యొచ్చు. కేజీఎఫ్ చిత్రం విడుదల అయిన కొన్ని రోజులకు దశాబ్ధాలుగా మూతపడిన ఆ బంగారు గనులను పునరుద్ధరించాలని భారత ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన విధితమే.
కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో లఘు చిత్రాలు(short films), డాక్యుమెంటరీలు వాటి వంతుగా భారత సినీ ప్రస్థానానికి మేలు చేస్తూనే ఉన్నాయి. చిన్న పసి మనసులు అర్ధం చేసుకోలేని తల్లి తండ్రుల గురించి వచ్చిన “తారే జమీన్ పర్” లాంటి చిత్రాలు కానీ, పుట్టిన నేలకు ఏదైనా చెయ్యాలి అని సంకల్పించే “స్వదేశ్” లాంటి చిత్రాలు కానీ సానుకూల మార్పును తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. కేవలం సామాజిక స్పృహ ఒక్కటే కాకుండా ఎన్ని బాధలు ఉన్న ఒక రెండు గంటల పాటు అన్నీ మర్చిపోయి సరదాగా వినోదం పొందే చిత్రాలు కూడా వీక్షకుల మెప్పు పొందుతూనే ఉన్నాయి. అభిమాన నటుడు నడిచినా, వెరైటీగా దువ్వినా, మీసం తిప్పినా, బీడీ కాల్చిన, ఒళ్లు వంకర్లు చేసి స్టెప్పులు వేసినా, ఒక గుద్దుకు పది మంది ఎగిరి అంత దూరంలో పడినా ఏదో సాధించాం అనుకునే అంతా సొంతం చేసుకోవడం కూడా భారత సినిమా ఇంత మన్నన పొందడానికి ఒక కారణమనే చెప్పొచ్చు.
భారతీయ సినిమా పరిశ్రమ ప్రారంభమైనప్పటి నుండి నిర్ణీత కాలంలో అభివృద్ధి చెందింది. కొన్ని దశాబ్దాల క్రితం విడుదలైన రోజున పెద్ద తెరపై సినిమా చూడటం దేశంలోని పరిమిత రాష్ట్రాలు, పరిమిత ప్రాంతాలు, ఆర్థిక పుష్టి కలిగిన ప్రజలకు మాత్రమే పరిమితం చేయబడింది. రిక్షా బండి మీద పేపర్లు పంచుతూ “నేడే విడుదల, నేడే చూడండి, ఆలోచిస్తే ఆశా భంగం” నుంచి ట్రైలర్లు, టీజర్లు, టీజర్లకు టీజర్లు, ఫస్ట్ లుక్కులు, ఫస్ట్ లుక్కుకి ప్రివ్యూలు అని ఈ రోజు సినిమా జనానికి మరింత దగ్గరవడానికి దొరికిన ప్రతి మార్గాన్ని వినియోగిస్తూ సాంకేతికతను అంది పుచ్చుకుని అందులో చాలా బాగా సఫలమైంది అనే చెప్పాలి; సిఇఓలు, బ్రాండ్ నిపుణులు, మార్కెట్ నిపుణులు సహా తయారీదారులు, ప్రకటనదారులు, బ్రాండ్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీ వారి వ్యాపార ప్రయోజనాల కోసం వెండితెరను, బుల్లి తెరను మొదటి అస్త్రంగా భావిస్తున్నారు. ఈ సాంకేతిక అభివృద్ధి ఫలితంగా, అనేక కార్పొరేట్లు తమ చివరి ప్రయత్నం వరకు ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యే దిశగా ప్రజలు అత్యంత ఇష్టపడే వేదికల్లో ఒకటిగా అవతరించిన సినిమా వైపే మొగ్గు చూపుతున్నారు.
భారతదేశంలో, నాణ్యమైన సినిమాలకు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే. అదే డిమాండ్ సినీ పరిశ్రమకు వినూత్న మరియు నాణ్యమైన విషయాలతో ముందుకు రావడానికి మార్గం సుగమం చేసింది. భారతీయ సినిమా పరిశ్రమలో బాలీవుడ్ ఆర్థిక అంశాల విషయంలో ఎప్పుడు పెద్ద పాత్ర పోషించింది. కానీ ఆ ధోరణి మారుతూ వచ్చింది. చిన్న పట్టణాలు మరియు ప్రాంతీయ చలనచిత్రాలు కూడా క్లిష్టమైన పాత్ర పోషిస్తున్నాయి. ఇది ఇకపై కేవలం బాలీవుడ్ పరిశ్రమ కాదు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ప్రపంచంలోనే అతిపెద్దది, ఏడాదిలో నిర్మించిన చిత్రాల సంఖ్య పరంగా, ప్రతి సంవత్సరం సుమారుగా 1800 సినిమాలను 25+ భాషలలో నిర్మిస్తున్నారు. వివిధ కారణాల వల్ల,ఎక్కువ వెసులుబాటు, ప్రజలలో మరింత ఎక్కువగా వ్యాప్తి చెందడం వల్ల సినిమా పరిశ్రమలో 2017 తర్వాత చాలా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. సాంకేతిక పురోగతి ప్రారంభించబడి చివరి మైలు కనెక్టివిటీ దిశగా ప్రయాణించేందుకు పెద్ద పాత్ర పోషిస్తుంది. విదేశాలలో విడుదలలు మరియు గ్రామీణ వ్యాప్తి కారణంగా ఈ విభాగం 2017 సంవత్సరంలో దాదాపు 30 శాతం పెరిగింది. ఇటీవలి పరిశ్రమ పిడబ్ల్యుసి నివేదిక ప్రకారం, 2021 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద సినిమా మార్కెట్‌గా అవతరించనుంది. రాబోయే నాలుగు సంవత్సరాల్లో భారత మీడియా మరియు వినోద పరిశ్రమ క్రమంగా వృద్ధి చెందుతుంది. ఈ పరిశ్రమ 2021 నాటికి రూ .2,91,000 కోట్లు దాటవచ్చని, ఇది 2017 మరియు 2021 మధ్య 10.5 శాతం కాంపౌండ్ వార్షిక వృద్ధి రేటు (సిఎజిఆర్) వద్ద పెరుగుతుందని అంచనా వేశారు.ఇటీవలి FICCI-EY నివేదిక ప్రకారం, దేశంలో నిర్మించిన చిత్రాలలో, 17 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, బాలీవుడ్ ఏటా నెట్ బాక్స్ ఆఫీస్ వసూళ్లకు దాదాపు 40 శాతం వాటా ఇస్తుంది. దాదాపు 29 ఇతర భారతీయ భాషలలో నిర్మించిన సినిమాలు 75 శాతం విడుదలైనా కానీ అవి వార్షిక దేశీయ బాక్సాఫీస్ వసూళ్లకు సుమారు 50 శాతం మాత్రమే దోహదం చేస్తున్నాయి.మిగితా శాతం హాలీవుడ్ మరియు అంతర్జాతీయ చిత్రాల నుండి సమకూరుతుంది.
2017 సంవత్సరంలో 100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలు తొమ్మిదికి పైగా ఉన్నాయి.2018 లో ఇది 12+ మరియు 50 కి పైగా చిత్రాలు మొత్తం బాక్సాఫీస్ వసూళ్లకు సుమారు 98 శాతం తోడ్పడ్డాయి. బాహుబలి 2, రోబోట్ 2.0 వంటి కొన్ని బ్లాక్ బస్టర్లు ఇప్పటికే కొన్ని కొత్త సంఖ్యా ప్రమాణాలను నిర్ణయించాయి. 2016 లో రూ.10.50 బిలియన్లతో పోల్చితే తెలుగు వంటి ప్రాంతీయ చలన చిత్ర పరిశ్రమలు 2017 లోనే 47.5 శాతానికి పైగా వృద్ధిని సాధించాయి. నికర దేశీయ వసూలు రూ.15.30 బిలియన్లుగా అంచనాకి రావడం జరిగింది. తమిళం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ మొదలైన ప్రాంతీయ చిత్రాలు కూడా మంచి వృద్ధి చూపించాయి.
క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పరిశ్రమ ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడానికి సంవత్సరంలో మంచి సీజన్ అనే చెప్పాలి. డిసెంబర్, జనవరి నెలలు సంవత్సరంలో సినీ పరిశ్రమకు బంగారు రోజులు అనే చెప్పాలి. ప్రజలు సెలవులు తీసుకోవటానికి లేదా వారి కుటుంబంతో పండగ కలిసి జరుపుకోవడానికి, సమయాన్ని ఇష్టమైన వాళ్లతో గడపడానికి ఇష్టపడే సమయం ఇది. ఇతర పర్యటనలు, వినోదాలు చాలా మందికి ఖరీదైన వ్యవహారంగా మారుతున్నందున, ప్రజలు ఆనందాన్ని పెద్ద తెరపై సినిమాలు చూడటానికి ఇష్టపడతారు అనేది వాస్తవం. సాంప్రదాయకంగా, సీజన్ యొక్క స్ఫూర్తిని పెంచడానికి సినిమాలు మన సమాజంలో పెద్ద పాత్ర పోషించాయి. పోషిస్తాయి, పోషిస్తూనే ఉంటాయి. ఇలాంటి సినిమా అంటే కేవలం వినోదమే కాకుండా ఎన్నో కుటుంబాల జీవనోపాధి అని కూడా మనం మరచిపోకూడదు. ఈ కుటుంబాలు బతకాలి అంటే సినిమా బతకాలి, సినిమా బతకాలి అంటే సినిమా హాల్లు, యాజమాన్యం బతకాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ ప్రభుత్వాలలో ఉండే పెద్ద మనుషులు “నా పెన్సిలు తీసేసాడు, సాయంత్రం వీడి సైకిలు గాలి తీసేయాలి” అనే ఎదగని మనస్తత్వం నుంచి బయటకి వచ్చి అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుని కక్ష కట్టి సినిమాని నమ్ముకునే కుటుంబాల కడుపు కొట్టరని ఆశిద్దాం..!!!
రాజుల ఘన చరితలు, బ్రిటీషువారి పాలనను వ్యతిరేకించిన ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల జీవిత గాథలను బుర్ర కథలుగా, హరి కథలుగా, వీధి నాటకాలుగా చూసి చూసి అదే మిళితమైన మన రక్తంలో సినిమా ఎప్పుడో ఉంటుంది. ప్రకృతిలో రంగులు ఉన్నంత వరకు భారత దేశంలో సినిమా ఉంటుంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, సినిమా శాశ్వతం !!!
సర్వేజనా సుఖిఃనోభవంతు...!!!
#Written By వాసుదేవ్ ట్విట్టర్ ఐడి : @nirvana_vasudev