గుంటూరు ( జనస్వరం ) : ముస్లిం సమాజం నిన్ను నమ్మి రెండు పర్యాయాలు శాసనసభ్యునిగా గెలిపిస్తే పది సంవత్సరాలుగా ముస్లింల అభివృద్ధికి ఏమీ చేయకపోగా ముస్లింల సంక్షేమానికి వెన్నుదన్నుగా ఉన్న అంజుమన్ స్థలాలను బినామీల పేరుతో కబ్జా చేయాలని చూడడం క్షమించరాని నేరమని, ముస్లింల ద్రోహిగా ముస్తఫా చరిత్రలో నిలిచిపోయాడని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, రాష్ట్ర మైనారిటీ నాయకులు షేక్ నాయబ్ కమాల్ అన్నారు. దిక్కూ మొక్కు లేని ఒక డమ్మీ సంస్థ పేరుతో కోట్ల రూపాయల అంజుమన్ స్థలాలను కబ్జా చేయాలని చూస్తున్న తూర్పు శాసనసభ్యుడు మహమ్మద్ ముస్తఫ పై ఆయన మండిపడ్డారు. సోమవారం ఆయన జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరితో కలిసి విలేకరులతో మాట్లాడారు ముస్లింల అభివృద్ధికి ఉపయోగపడాల్సిన అంజుమన్ స్థలాలను ధారాదత్తం చేయటానికి నీకున్న అర్హతలేమిటని ముస్తఫా ని ప్రశ్నించారు. నీకు అంతగా ఆ సంస్థపై ప్రేమ ఉంటే నువ్వు కొన్నాళ్లుగా అక్రమంగా సంపాదించిన ప్రజాధనంలో కొంతభాగాన్ని ఇవ్వాలన్నారు. అంజుమన్ సంస్థకు కేర్ టేకర్ గా నీ తమ్ముడు కర్ణుమాని పెట్టుకుంది స్థలాలను దోచుకునేందుకేనా అని ధ్వజమెత్తారు. కనురెప్పే కాటేసిన చందాన కాపాడాల్సిన వాళ్లే కబ్జాలు చేయటానికి ప్రయత్నం చేయటం అత్యంత దుర్మార్గమన్నారు. గతంలోనూ రెడ్డి పాలెంలో కోట్ల విలువైన వక్ఫ్ బోర్డ్ స్థలాలను నీ కుటుంబ సభ్యుల పేరిట దోచుకోవాలని చూడటాన్ని ముస్లింలు ఇంకా మరచిపోలేదని మండిపడ్డారు. మీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని విలువైన ఆస్తుల్ని కొల్లగొడుతుంటే ఆయన స్పూర్తితో నువ్వు ముస్లింల అభివృద్ధికి కేటాయించిన స్థలాలను దోచుకోవాలని చూస్తున్నవా అని దుయ్యబట్టారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన ముస్తఫాకి ఇవ్వే చివరి ఎన్నికలని అర్ధమైందన్నారు. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్నా చందంగా వక్ఫ్ బోర్డ్ , అంజుమన్ ఆస్తుల్ని దోచుకోవటమే లక్ష్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు చెందిన వక్ఫ్ బోర్డ్ , అంజుమన్ స్థలాలలో ఒక్క అంగుళం దోపిడీకి గురైన జనసేన పార్టీ సహించదన్నారు. అంజుమన్ స్థలం విషయంలో ముస్తఫా ఒక్క అడుగు ముందుకు వేసినా జనసేన పార్టీ తరుపున తీవ్రస్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. వక్ఫ్ బోర్డ్ , అంజుమన్ స్థలాల విషయంలో జరుగుతున్న కబ్జాల పర్వంపై సమగ్ర నివేదికను త్వరలోనే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు నాయబ్ కమాల్ తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com