విజయనగరం, జనవరి 19, (జనస్వరం) : నెల్లిమర్ల నియోజకవర్గ అభివృద్ధిని లక్ష్యంగా ఎమ్మెల్యే లోకం నాగ మాధవి సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధానంగా అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేకంగా వినతిపత్రం అందజేశారు. విమానాశ్రయ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో, నియోజకవర్గంలోని అప్రోచ్ రోడ్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ప్రధాన మార్గాల్లో రోడ్డు విస్తరణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, ప్రయాణికులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అలాగే విమానాశ్రయానికి చేరుకునే మార్గాల్లో భద్రత, సౌకర్యాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
అదేవిధంగా నియోజకవర్గంలోని MSME పార్కుల్లో మౌలిక సదుపాయాల కొరతను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. పరిశ్రమదారులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. VMRDA మాస్టర్ ప్లాన్–2041లో ప్రతిపాదిత రోడ్ల అలైన్‌మెంట్లపై ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, నివాస ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. అలాగే డెంకాడ, నెల్లిమర్ల మండలాల్లో తాగునీటి సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, పెండింగ్‌లో ఉన్న స్థానిక అభివృద్ధి పనులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే నెల్లిమర్ల నియోజకవర్గం అభివృద్ధి దిశగా కొత్త మలుపు తిరుగుతుందని, అందుకు అవసరమైన రోడ్డు కనెక్టివిటీ, పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధిని నిరంతరం పర్యవేక్షిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.