నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి సూచనలతో నెల్లూరు మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయాన్ని సందర్శించిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల గారు మాట్లాడుతూ, ప్రస్తుతం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చెత్తను తరలించే వాహనాలు దాదాపు 54 పని చేస్తున్నాయి. మరో 125 కొత్తవి కావాలని, వాటిని కొనుగోలు చేయాలని కమిషనర్ గారు ప్రకటించడం జరిగింది. కానీ మున్సిపల్ కార్యాలయం దగ్గర దాదాపు 50 నుండి 60 వాహనాలు గత రెండు, మూడు సంవత్సరాల లోపల కొన్న వాహనాలు శిథిలావస్థకు చేరాయి. ఇవన్నీ బ్యాటరీ వాహనాలు అవ్వడం ఇంకో విశేషం. బ్యాటరీ వెహికల్స్ వాడడం వల్ల పర్యావరణానికి నష్టం కలగదు అని చెప్పి ఎక్కువమంది బ్యాటరీ వెహికల్స్ వాడడం జరుగుతుంది. కానీ మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాత్రం కొద్దిపాటి నిర్వహణ చేస్తే బాగుపడే రూ.కోట్ల విలువైన వాహనాలు, యంత్రాలు తుప్పుపడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నిర్వహణలోపంతో చాలా వరకు వాహనాలు మూలకు చేరాయి. వాటికి మరమ్మతులు చేయించకుండా అధికారులు కొత్త వాహనాల కొనుగోలుపై మోజు పెంచుకున్నారు. ఫలితంగా పాత వాహనాలు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. కొత్త వాహనాలను కొని ప్రజలపై ఆర్థికభారం మోపుతున్నారు. పన్నురూపంలో ముక్కుపిండి ప్రజల నుండి వసూలు చేసిన నిధులు తిరిగి ప్రజాభివృద్ధికి ఉపయోగపడాల్సిందిపోయి అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో ఇలా మరుగునపడుతున్నాయి. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న మన రాష్ట్రంలో ఖర్చులు ఎంత తగ్గించుకుంటే అంత మనకే మంచిదని,పాత వాహనాల మరమ్మతులులకు తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, జనసేన యువజన విభాగ సభ్యులు బాలాజీ, జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.