గుంటూరు ( జనస్వరం ) : రాజ్యాంగ విరుద్ధమైన విధులను నిర్వర్తించాలని వాలంటీర్లపై విపరీతమైన ఒత్తిడి తీసుకువస్తూ వారి జీవితాలతో మంత్రి రజిని చెలగాటమాడుతుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి విమర్శించారు. తమ పరిధిలోని ఓటర్ల సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలంటూ వాలంటీర్లతో గత వారం రోజులుగా మంత్రి కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు పెట్టి సభలు నిర్వహిస్తున్నా, పెద్ద పెద్ద హోర్డింగులతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినా ప్రజల్లో ఆదరణ లేదన్నారు. దీంతో ఎలాగైనా గెలవాలని పెద్దఎత్తున కుట్రలకు మంత్రి రజిని పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇందుకు పావులుగా వాలంటీర్లను వాడుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా, చట్టవ్యతిరేకమైన ఓట్ల సేకరణను చేపట్టాలని వాలంటీర్లకు ఆదేశాలు జారిచేయటం దుర్మార్గమన్నారు. సమాచారాన్ని సేకరించటానికి వెళ్ళినప్పుడు ప్రజలు తమని దొంగళ్ళ చూస్తున్నారని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇవేమీ పట్టని మంత్రి రజిని రెండురోజుల్లో సమగ్ర ఓట్ల నివేదికను అందించాలని ఒత్తిడి తీసుకు వస్తుండటంతో వాలంటీర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఎన్ని కుయుక్తులు పన్నినా , కుట్రలు చేసినా మంత్రి రజినీ ఓటమి నుంచి తప్పించుకోలేదన్నారు. ఓటు హక్కు ప్రజల వ్యక్తిగతమని , ఓట్ల సమాచారాన్ని వాలంటీర్లు తిరస్కరించాలని కోరారు. వైసీపీ పాపాల్లో భాగస్వామ్యులు కావద్దంటూ వాలంటీర్లకు విజ్ఞప్తి చేశారు. వాలంటీర్ల కష్టాన్ని ప్రభుత్వం దోచుకుంటుందని మండిపడ్డారు. ఇప్పుడు వైసీపీ నేతల ఒత్తిడికి లొంగి తప్పులు చేస్తే ప్రభుత్వం మారాక వాలంటీర్లను ఎవరూ రక్షించరన్నారు. ప్రభుత్వం మారితే వాలంటీర్లను తొలగిస్తారంటూ వైసీపీ నేతలు చెబుతున్న మాటల్ని నమ్మొద్దన్నారు. ఐదు వేల జీతం దగ్గరే యువత ఆగిపోవటం శోచనీయమన్నారు. యువతను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా చూడాలన్నది పవన్ కల్యాణ్ కోరిక అన్నారు. వైసీపీ ఇంకోసారి వస్తే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాలంటీర్లు ప్రజల్ని చైతన్యపరచాలని ఆళ్ళ హరి కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com