అనంతపురం, (జనస్వరం) : విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉపాధ్యాయుల పైన దురుద్దేశంతో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జయరాం తెలిపారు. ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు చేతకాని హామీలు ఇచ్చి, నెరవేర్చలేక ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యంగా ఉపాధ్యాయులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని దురుద్దేశంతో అవినీతి యాప్ రూపొందించి 14400 కాల్ సెంటర్ పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులు అవినీతి చేస్తే ఏ కాల్ సెంటర్కు ఫోన్ చేయాలి? ప్రభుత్వ స్కూల్లకు బుక్కులు సప్లై చేయలేక, ప్రభుత్వం హామీ ఇచ్చిన కిట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమకూర్చలేక, ప్రతి జిల్లాలో DEOల ద్వారా హెడ్మాస్టర్లకు వీడియో కాల్ చేయించి ఎవరైనా అడిగితే బుక్కులన్నీ సప్లై చేసినం, కిట్లన్నీ ఇచ్చినామని చెప్పాలి లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలు ఉపాధ్యాయులు బయటబెడతారని దురుద్దేశంతో రోజు ఉపాధ్యాయుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఉపాధ్యాయుల్ని ప్రజల్లో చులకన చేసే దురుద్దేశంతో ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని జయరాం మండిపడ్డారు.