అనాధ శవానికి దహన సంస్కారాలు చేసి మానవత్వాన్ని చాటుకున్న జనసైనికులు
ఈ కరోనా విపత్కర సమయంలో సామాన్యులు ఆర్థికంగా క్షీణించడమే కాకుండా, కరోనా ధాటికి జీవితాలు చిన్నా భిన్నం అవుతున్నాయి. ఈ కరోనా సంక్షోభంలో ఇంట్లో వారు మరణిస్తేనే దహన సంస్కారాలు చేయాలంటే భయపడుతున్నారు. అలాంటిది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ స్పూర్తితో జనసైనికులు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ప్రకాష్ నగర్ జివిఎంసి స్కూల్ వద్ద ఓ మానసిక వికలాంగురాలు అయిన వృద్ధురాలు మృత్యువాత పడ్డారు. ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించేందుకు సైతం ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న స్థానిక జనసైనికులు ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మానవత్వం ఉనికి కోల్పోతున్న పరిస్థితుల్లో ఆ వృద్ధురాలికి జనసైనికులే ఆ నలుగురై పాడె మోసి, అంత్యక్రియలు చేయడం పట్ల సర్వత్ర ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జనసైనికులు మాట్లాడుతూ ఎవరికి ఏం కష్టం వచ్చినా ఆదుకోవడానికి మా జనసైనికులు ముందు ఉంటారని, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో నడుస్తూ మానవత్వాన్ని కాపాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి ప్రకాష్, జనసైనికులు దర్మేంద్ర, నగేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.