మండపేట ( జనస్వరం ) : మండపేట నియోజకవర్గానికి సంబంధించి 43 గ్రామాలను రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (రుడా) లో కలపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది చాలా దారుణమని మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ గారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేగుళ్ళ లీలాకృష్ణ చేసిన మీడియా సందేశంలో ఆయన మాట్లాడుతూ మండపేట నియోజకవర్గంలో 43 గ్రామాల పంచాయతీలను రుడాలో కలపడానికి పంచాయతీ తీర్మానం చేసి ఇవ్వాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆదేశాలు ఇవ్వడం చాలా దారుణం అన్నారు. రుడాలో ఈ గ్రామాలను కలపడం వలన సామాన్యుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. చిన్న ఇల్లు కట్టుకోవాలంటే రుడా అనుమతి తీసుకోవాలని, సామాన్యుడికి తొందరగా అయ్యే పని కాదని అన్నారు. చిన్న పర్మిషన్ కావాలన్నా దాదాపు సంవత్సరం పట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మండపేట నియోజకవర్గాన్ని రాజమండ్రిలో కలపడానికి అభ్యంతరం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని రుడాలో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇదంతా సామాన్యుడిని ఇబ్బంది పెట్టి, తన ఆఫీస్ కి రావాలని, గ్రామ పంచాయతీ ఎవ్వరికి కూడా అధికారం వుండకూడదని ఉద్దేశంతో ఈ దుర్మార్గమైన ఆలోచనకు వాడి కట్టారని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఈ దుర్మార్గపు చర్యను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అవసరమైతే దీనిని అడ్డుకోవడానికి అన్ని గ్రామ పంచాయితీలు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఆయన కోరారు.