వచ్చే నెల 1న రాష్ట్రంలో బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్‌నగర్, నిజామాబాద్ సభల వేదికగా సమరభేరి మోగించనున్నారు. ఆ తర్వాత బీజేపీ అగ్రనేత అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రచార బరిలో దిగనున్నారు. వచ్చే నెల రెండో వారంలోపు రాష్ట్ర ఎన్నికల షెడ్యూలు రావచ్చని ప్రచారం నడుమ.. బీజేపీ ప్రచారపర్వంలో దూకుడు పెంచాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా అగ్రనేతలు తెలంగాణలో పర్యటించేలా కమలం కార్యాచరణ సిద్ధం చేసింది. రెండు రోజుల విరామంలో రాష్ట్రానికి రెండు సార్లు రానున్న ప్రధాని మోదీ పర్యటనలను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అక్టోబరు 1న మహబూబ్‌నగర్‌లో, 3న నిజామాబాద్‌లో జరిగే సభలతోనే రాష్ట్రంలో ఎన్నికల శంఖం పూరిస్తామని బీజేపీ ముఖ్యనేతలు ప్రకటించారు. అక్టోబర్ 1న.. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నం 1:30 గంటలకు మోదీ చేరుకోనున్నారు. అనంతరం విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో 1:45 గంటల నుంచి 2:15 గంటల వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్ బయల్దేరి వెళ్లనున్నారు. 3:05 గంటలకు మహబూబ్‌నగర్ చేరుకుంటారు. 3:15 గంటల నుంచి 4:15 గంటల వరకు మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్‌లో బీజేపీ నిర్వహించే సమరభేరి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సభా వేదిక నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్? లక్ష్యంగా ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ ముగించుకుని సాయంత్రం 4:30 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి బయల్దేరి సాయంత్రం 5:05 గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 5:10 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి దిల్లీకి ప్రత్యేక విమానంలో తిరుగు ప్రయాణం కానున్నారు.
మరోవైపు ప్రధాని సభలకు భారీ జన సమీకరణపై పార్టీ నాయకత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా మహిళా బిల్లు ఆమోదం నేపథ్యంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ సభ ఏర్పాట్లను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా పరిశీలిస్తుండగా.. మహబూబ్‌నగర్‌లో ఏర్పాట్లను రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పర్యవేక్షిస్తున్నారు. మోదీ పర్యటన తెలంగాణ రాజకీయాలను దిశానిర్దేశం చేస్తుంది కిషన్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటన తర్వాత బీజేపీ అగ్రనేత అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు, ఇతర జాతీయ నాయకుల సభలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. గతంలో చేపట్టాలనుకున్న బస్సు యాత్ర స్థానంలో వీటిని నిర్వహించాలని నిర్ణయించారు.