నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 303వ రోజున ఉగాది పండుగ రోజున 9వ డివిజన్ బంగ్లా తోట ప్రాంతం శివాలయం వీధిలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా తమ వంతు పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్ళకు సంబంధించి లబ్ధిదారులకు పలు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయని, కానీ లబ్ధిదారులకు గృహాలు అప్పజెప్పకుండానే ప్రభుత్వం మారిందని, వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలే లేవని, కానీ లబ్ధిదారులకు మాత్రం లోన్ కట్టాలంటూ బ్యాంకుల నుండి రిమైండర్లు వస్తున్నాయని తెలిపారు. పేదల ఇళ్ళ విషయంలో ఇంత దుర్మార్గంగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గు చేటని అన్నారు. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెత చందంగా ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వని ఈ ప్రభుత్వం పత్రికల్లో మాత్రం ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజలందరినీ అబద్ధాలతో మభ్యపెడుతూ మోసగిస్తున్న ఈ ప్రభుత్వ అంతానికి రోజులు దగ్గరపడ్డాయని, రానున్నది పవనన్న ప్రభుత్వమే అని, లబ్ధిదారులకు నూటికి నూరు శాతం న్యాయం తాము చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.