నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 204వ రోజున 43వ డివిజన్ కంషాద్ వలి దర్గా సచివాలయ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి ప్రజాసమస్యలను అధ్యయనం చేసి పోరాడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ప్రకటనలకే పరిమితమైందని అన్నారు. 2019 లో అధికారంలోకి వచ్చి 2020, 2021 లలో బులుగు, పచ్చ రంగులతో ఆకర్షణీయంగా డిజైన్ చేసి ప్రతి పత్రికలో ప్రకటనలు ఇచ్చారని, కానీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేకపోయారు అని దుయ్యబట్టారు. గ్రూప్ 1, గ్రూప్ 2 కోసం కోచింగ్ తీసుకుంటున్న ఉద్యోగ అభ్యర్థుల వయస్సు అయిపోతోంది కానీ ప్రభుత్వ తీరు మారటం లేదన్నారు. ఇంకో నెలలో నూతన సంవత్సరం జనవరి నెల రాబోతోందని, మరో ఆకర్షణీయమైన పేపర్ ప్రకటనని చూపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని అన్నారు. ఈ డ్రామాలు నిరుద్యోగులు అందరూ గ్రహించారని, వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాలంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.