
నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 260వ రోజున 54వ డివిజన్లో వెంకటేశ్వరపురం భగత్ సింగ్ కాలనీ ప్రాంతంలో జరగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి వద్ద ఈ ప్రాంత ప్రజలు వరదల సమయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. పెన్నా నదికి వరద పోటెత్తే సమయంలో తమ నివాసాలు నిండా మునుగుతున్నాయని, గత ఎన్నికల ముందు ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని, నదికి రక్షణ గోడ కట్టించి వరద తాకకుండా చూస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తాను జలవనరుల శాఖకే మంత్రిగా ఉండి కూడా తమ సమస్యకు పరిష్కారం చూపలేదని, తీరా పదవి పోయాక శంఖుస్థాపన డ్రామా ఆడారని తెలిపారు. సమస్యను విన్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ తాను వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ లాగా మాయ మాటలు చెప్పే వ్యక్తిని కాదని, మోసపూరిత చర్యలు తనకు తెలియవని, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలిచేది తామేనని, ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మూడు కాలువల బినామీ కాంట్రాక్టుల మీద పెట్టిన శ్రద్ధ సోమశిల రిజర్వాయర్ రివిట్మెంట్, పెన్నా నది రివిట్మెంట్ గోడల మీద పెట్టలేదని, 30 కోట్లు కూడా కాని కాలువ గోడకు 110 కోట్లు బినామీ పేరుతో నొక్కే అవకాశం కల్పించుకుని ప్రజలకు ఉపయోగపడే నిజమైన పనులను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.