ఎమ్మిగనూరు, (జనస్వరం) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని ఎమ్మిగనూరు పట్టణంలోని మండల ఆఫీస్ దగ్గర నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు చల్లా వరుణ్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహనీయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలి అని, సంజీవయ్య ఇంటిని స్మారక చిహ్నంగా మలచడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోటి రూపాయలతో నిధినీ ఏర్పాటు చేసిన రోజునే కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కర్నూలు జిల్లా పర్యటన పర్యటనకు వచ్చినప్పుడు పెద్దపాడు లోని సంజీవయ్య గారి ఇంటిని సందర్శించి పెద్ద పాడు గ్రామ ప్రజలతో మమేకమై ఇంత గొప్ప మహనీయుడు పేరుని కర్నూలు జిల్లాకు పెట్టాల్సిందేనని డిమాండ్ చేయడం జరిగింది. ఇది డిమాండ్ కాదు ఒక హక్కుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. సంజీవయ్య గురించి రెండున్నర దశాబ్దాలుగా వింటున్నాము. మేధావులు విద్యావేత్తలు అధికారులు సంజీవయ్య విశిష్టత పాలన దక్షత చెప్పుతూ ఆయన గొప్పతనం ఇలా నాలుగు గోడల మధ్యనే చర్చలకే పరిమితం కారాదు. భావితరాలకు ఆయన గొప్పతనం తెలియాలంటే ఆయన చేసిన సేవలను భావితరాలు మరిచిపోకూడదు అనుకుంటే కర్నూలు జిల్లాకి ఆయన పేరు పెట్టి ఆయనను గౌరవించాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన నందమూరి తారక రామారావు పేరును కృష్ణా జిల్లాకు పెట్టినప్పుడు అలాగే డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును కడప జిల్లాకు పెట్టినప్పుడు అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా చేసిన దామోదరం సంజీవయ్య పేరు కూడా కర్నూలు జిల్లాకు పెట్టాల్సిందేనని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే రెవెన్యూ డివిజన్ అయినా ఆదోని జిల్లాగా ప్రకటించాలి. ఆదోని జిల్లాగా ప్రకటించిన అప్పుడే ఈ పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆదోని డివిజన్ లో ఉన్న ఎమ్మిగనూర్, మంత్రాలయం, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గ ప్రజలకు అనువుగా ఉంటుంది. ఆలూరు, ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాలకి కర్నూల్ సుమారుగా 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పరిపాలన సౌలభ్యం కోసం ఆదోని ని జిల్లాగా ప్రకటించాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చేనేత వికాస్ విభాగం రాష్ట్ర కార్యదర్శి మాదిగుండు శివ, నందవరం మండలం నాయకులు ఇమామ్, ప్రసాద్, మరియు గోనెగండ్ల మండలం నాయకులు జానీ, ఫణి, మున్న, నవీన్, నాసీర్, ఉదయ్, రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.