Search
Close this search box.
Search
Close this search box.

కోడికత్తి, కిరాయి మూకలకు భయపడేదే లేదు : జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్

    అమరావతి, (జనస్వరం) : కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ నేతలతో భేటీ అనంతరం పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. వైసీపీ గ్రామ సింహాల ఘోంకారాలు సహజం.. జనసైనికుల సింహ గర్జనలు సహజం అని వ్యాఖ్యానించారు. ‘ఘోంకారం అంటే మొరుగుట.. గ్రామ సింహాలంటే కుక్కలు. గ్రామ సింహాలు అంటే పళ్లు రాలగొట్టించుకునే కుక్కలు’ అని పవన్‌ వివరించారు. ‘‘భయం అంటే ఎలా ఉంటుందో నేను నేర్పిస్తా. కులాల చాటున దాక్కుంటే బయటకు లాక్కొచ్చి కొడతా. సొంత చిన్నాన్న హత్యకు గురైతే చంపిందెవరో చెప్పలేరా? కోడికత్తి కేసు ఏమైందని అడిగితే మీరు స్పందించిన తీరేంటి? నాకు బూతులు రాక కాదు, బాపట్లలో పుట్టినోడిని నాకు తిట్లు రావా? నేను నాలుగు భాషల్లో బూతులు తిట్టగలను. నాలుగు రోజులు సమయమిస్తే నేర్చుకుని మరీ.. ఏ భాషలో కావాలంటే ఆ భాషలో తిడతా. వైకాపా అధినేత కూడా నా వ్యక్తిగతం గురించి మాట్లాడారు. నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు.. నేను వైసీపీ వారిలా మాట్లాడట్లేదు. మా నాన్న నాకు ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ లక్షణాలు ఇచ్చారు. వైసీపీ నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నా’’ అని అన్నారు.

ఎలా కావాలంటే అలా యుద్ధం చేస్తాం..
‘‘ వైసీపీ నేతలకు ఏ పద్ధతిలో కావాలంటే అలా యుద్ధం చేస్తాం. 2014లో టీడీపీ, బీజేపీకి కూడా అభివృద్ధి కోసమే మద్దతిచ్చా. ఏపీ అభివృద్ధి గురించి మాత్రమే అడుగుతా. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం నాలో ఉంది. ఇంట్లో వారి కారణంగా ఇష్టం లేకపోయినా సినిమాల్లోకి వచ్చా. రాజకీయాల్లో కలుపు మొక్కలను తీసేయగలను. నిజమైన ప్రెసిడెంట్‌ మెడల్‌ రావాలంటే యుద్ధాలు చేయాలి. ఏపీ ప్రభుత్వం నెలకు రూ.5000 ఇస్తే ప్రెసిడెంట్‌ మెడల్‌ ఇస్తుంది. రూ.5000కే ప్రెసిడెంట్‌ మెడల్‌, మద్యం అమ్ముతున్నారు. నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అనే సామెత వైసీపీ ప్రభుత్వం నిజం చేస్తుంది. నన్ను తిడితే ఏడుస్తానని వైసీపీ నేతలు భ్రమపడుతున్నారు. నన్ను తిట్టేకొద్దీ నేను బలపడతాను తప్ప బలహీనపడను. నేను బలహీనపడక పోగా ఎవరినీ మరిచిపోయే ప్రశ్నే లేదు. నా అంతట నేను యుద్ధం చేయను, నన్ను లాగితే వదలను. అభివృద్ధి గురించి ఏపీలో మాట్లాడటానికేం లేదు. ఏపీలో రోడ్లు వేయటానికి కూడా ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవు. ప్రజలు నావారు అనుకోబట్టే ప్రతి సన్నాసితో తిట్టించుకుంటున్నాను. కోడికత్తి, కిరాయి మూకలకు భయపడే ప్రశ్నేలేదు’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

మద్యం మామూళ్లు ఎక్కడికెళ్తున్నాయి..
‘‘నేను సినిమా టికెట్ల గురించి మాత్రమే మాట్లాడా.. నాకేమీ సినిమా థియేటర్లు లేవు. మీ వైకాపా నేతలకే థియేటర్లు ఉన్నాయి. నా మొదటి సినిమాకు మా బావ అరవింద్‌ రూ.5వేలు ఇచ్చారు. జానీ సినిమాకు తీసుకున్న డబ్బు మొత్తం వెనక్కి ఇచ్చేశా. మా కష్టార్జితంపై ప్రభుత్వం పెత్తనం ఏమిటని మాత్రమే అడిగాను. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కాట్ల కుక్కల్లా అరుస్తున్నారు. వైసీపీ వాళ్లు సొంత డబ్బు ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చారా? సైనిక సంక్షేమ బోర్డుకు రూపాయైనా ఇచ్చారా? రూ.లక్ష కోట్లు సంపాదించినా ఎంగిలి చేత్తో కాకిని కూడా విదల్చరు. ప్రజలు ప్రతి పనికి ప్రభుత్వానికి పన్ను కడు3తున్నారు. భారతీ సిమెంట్‌ను అందరికీ ఉచితంగా పంచవచ్చు. అడిగిన దానికి సమాధానం చెప్పని వైసీపీ వాళ్లకు సిగ్గుండాలి. వైసీపీ నేతలు బెదిరిస్తే భయపడటానికి ఇడుపులపాయ ఎస్టేట్‌ కాదు. జగన్‌ ప్రమాణ స్వీకారానికి రమ్మని ఆహ్వానించిన రోజే ఓ మాట చెప్పా. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తానని ఆనాడే వైకాపా వాళ్లకు చెప్పా. వైసీపీ సర్కార్‌ అమ్మే మద్యంలో మామూళ్లు ఎక్కడికెళ్తున్నాయి. వైకాపా వద్ద కిరాయి ముఠాలు ఎన్ని ఉన్నా భయపడను. భగత్‌ సింగ్‌, బోస్‌, గాంధీలకు తలవంచుతా. వైసీపీ నాయకుల తాట తీస్తాను తప్ప తలొంచను. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే ఆడపడుచులను తిట్టిస్తారా? వైకాపా నాయకులకు ఆడబిడ్డల్లేరా? ఇంట్లో ఆడపడుచులు లేరా? జీతాలు, పింఛన్లు ఠంచనుగా ఇవ్వలేని దుస్థితిలో ఏపీ ఉంది. వితంతు పింఛన్లు సకాలంలో ఇవ్వలేని దుస్థితి. నేను రూ.కోట్లు పన్ను కట్టే సినీరంగం నుంచి వచ్చిన వాడిని. ప్రజారాజ్యం పార్టీ వేళ అన్నకు అండగా ఉందామనుకున్నా. నేరుగా రాజకీయాల్లోకి రావాలని ఏనాడూ అనుకోలేదు. 2014లో టీడీపీకి మద్దతిచ్చినా ఏ సాయం పొందలేదు. పార్టీ ఆఫీస్‌ కోసం టీడీపీ ప్రభుత్వాన్ని స్థలం కూడా అడగలేదు. నేను ఇచ్చే వాడినే తప్ప తీసుకునే వాడిని కాదు. జనం కోసం నా పౌరుషాన్ని తగ్గించుకుంటాను. 151 సీట్లు గెలిచిన పార్టీ.. అందరినీ చంపేద్దామనుకుంటే ఎలా? అందరినీ భయభ్రాంతులను చేసి పాలించడం సాధ్యమేనా? 2014లో చంద్రబాబు నా ఆఫీసుకు వచ్చారు. చంద్రబాబును రమ్మనటానికి కారణం మాకు గౌరవం కోరుకోవటమే. నా ఆత్మాభిమానంపై దెబ్బకొడితే అంతే గట్టిగా బదులిస్తాం. నేనెప్పుడూ డబ్బు వెంట పడలేదు’’ అని పవన్‌ అన్నారు.

అమరావతిని కొనసాగించమని బీజేపీకు చెప్పా..
‘‘కేంద్రంతో పోరాడదామంటే నన్ను గెలిపించ లేదు. విశాఖలో గెలిపించి ఉంటే విశాఖ ఉక్కు కోసం నిలబడేవాడిని. వైసీపీకు ఓట్లేసి నన్ను పనిచేయమనడం భావ్యమా? అయినా నా శక్తి మేర పనిచేస్తా. పాతికేళ్లు జనంలో పనిచేస్తానని 2014లో చెప్పా. నన్ను గెలిపించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా. ఆడబిడ్డ వైపు చూడాలంటే భయపడేలా శాంతిభద్రతలు కాపాడతా. కులాలకు సంబంధించి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని కులాలు ఐక్యంగా ఉండకపోతే ప్రజలే నష్టపోతారు. స్నేహానికైనా వైరానికైనా నేను సిద్ధమే. నా ఆర్థిక మూలాలు దెబ్బకొడతానంటే అభ్యంతరం లేదు. నన్ను కాపులతోనే కాదు అన్ని కులాలతో తిట్టించండి. ఏ కులం నూరు శాతం ఎవరితోనూ ఉంటుందని అనుకోను. కాపులు నాతో ఉంటే కాకినాడలో ద్వారంపూడి నన్నెలా తిట్టగలిగేవారు? కాపు ఉద్యమంలో వైసీపీ వారే చొరబడి అలజడి సృష్టించారు. తుని రైలు ఘటనప్పుడు వైకాపా వర్గాలు అల్లర్లు రేపాయని సమాచారం. కులాల తగాదాలతో రాష్ట్ర అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం తగలబెట్టేస్తోంది. అమరావతిని కొనసాగించమని బీజేపీకు చెప్పా. ప్రత్యేక హోదా కోసం గట్టిగా పోరాడా. ప్రత్యేక హోదా విషయంలో నాకు అండగా ఉండాల్సిన వారే బంధాలు వేశారు. వైకాపా దుష్టపాలన అంతమొందించే సమయం ఆసన్నమైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మార బోతున్నాయి. ఓడిపోతానని నేనూ అనుకోలేదు. వైసీపీ ఓడిపోతుందని వారు అనుకోకపోవచ్చు. ఊహించనివి జరగడమే ఎన్నికలంటే. ఇప్పుడు 151 సీట్లు వచ్చిన వైసీపీకు 15 సీట్లు రావచ్చుగా! వచ్చే ఎన్నికల్లో అధర్మం ఓడి ధర్మంగా పాలించే ప్రభుత్వం వస్తుంది. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాం’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way