విశాఖపట్నం, అక్టోబర్ 14, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యవంతంగా నిలిచే 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖపట్నంలో ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ వ్యవస్థాపక సీఈఓ లోకం ప్రసాద్ పాల్గొన్నారు. సదస్సులో "Unlocking India's Eastward Gateway: Reducing Logistics Costs and Powering Manufacturing through Coastal Advantage" అంశంపై ప్రత్యేక సమావేశం జరిగింది. తీరప్రాంతాన్ని సమర్థంగా ఉపయోగించి రవాణా ఖర్చులను తగ్గించడం, తయారీ రంగానికి కొత్త దిశ చూపడం వంటి విషయాలపై ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు.
కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రానికి ఉన్న విస్తారమైన తీరప్రాంతం ఒక గొప్ప అవకాశమని పేర్కొంటూ, లాజిస్టిక్స్ రంగాన్ని బలోపేతం చేసే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. తూర్పు తీరాన్ని ప్రపంచ పారిశ్రామిక కేంద్రంగా ఎదగడానికి ప్రభుత్వం స్పష్టమైన దిశలో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్న అవకాశాలు, కొత్త విధానాలు మరియు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలపై వివరించారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించడంలో విజయాన్ని సాధించింది. లోకం నాగ మాధవి, లోకం ప్రసాద్ ఇతర అంతర్జాతీయ ప్రతినిధులతో కలిసి పెట్టుబడి అవకాశాలు, అభివృద్ధి మార్గాలపై చర్చించారు.
