- 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.16,20,000 లాభం
- రైతులకు డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయం
కడియం, మార్చి 30 (జనస్వరం) : కడియం మండలం కడియపులంక నెహ్రూ విశాల సహకార పరపతి సంఘం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.16,20,000 లాభం ఆర్జించడంతో పాటు గత నాలుగేళ్లుగా సొసైటీ లాభాల బాటలో ఉందని పాలకవర్గం తెలిపింది. సోమవారం సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్‌పర్సన్ గట్టి నరసయ్య, సభ్యులు కొటికలపూడి వెంకటేశ్వరరావు, అంజారు వెంకటరామారావు ఆధ్వర్యంలో సర్వ మహాజన సభ నిర్వహించారు. సంఘ సీఈవో అర్థవార్షిక జమా ఖర్చులను వివరించారు. వాయిదా మించిన బకాయిలు రూ.1 కోటి 50 లక్షల వరకు ఉన్నందున వాటిని వెంటనే వసూలు చేయాలని సంఘ సిబ్బందిని పాలకవర్గం ఆదేశించింది. రైతులకు వారి పంటలకు కావాల్సిన ఎరువులు సొసైటీలో అందుబాటులో ఉన్నాయని, సొసైటీ ద్వారా ఎరువులు కొనుగోలు చేసి సంఘ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సొసైటీ లాభాల బాటలో ఉండడంతో రైతులకు డివిడెండ్ ఇవ్వాలని నిర్ణయించారు..ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోడపాటి గోపాలకృష్ణ (గోపి), మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పంతం గణపతి, కూటమి నాయకులు గట్టి సుబ్బారావు, మార్గాని ఏడుకొండలు, బొరుసుబ్రహ్మణ్యం, నర్సరీ రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.