● వైసీపీ ప్రభుత్వం మైనారిటీలను విస్మరించింది
● మైనారిటీలకు అందాల్సిన రుణాలను ఇవ్వకుండా ముస్లిం కార్పొరేషన్ నిధులను వివిధ పథకాల్లో కలిపేశారు
● దుల్హన్ పథకం క్రింద 50వేలు కాదు లక్ష రూపాయలు ఇస్తామన్నారు, కానీ అసలేమీ ఇవ్వట్లేదు
● ఉర్దూని రెండో అధికారిక భాష చేస్తే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ట్రాన్సలేటర్ ఉద్యోగాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం చేయట్లేదు
● వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన రంజాన్ కానుకను చంద్రబాబు కొనసాగించారు కానీ జగన్ ఎత్తేశారు
● వక్ఫ్ బోర్డు ఆస్తులకూ వైసీపీ ప్రభుత్వంలో ఆపద వచ్చింది
● పవనన్న ప్రజాబాటలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి
నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట 30వ రోజున జాకీర్ హుస్సేన్ నగర్ లోని పలు వీధులలో జరిగింది. ఈ ప్రాంతంలోని ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను విని అండగా ఉంటూ పరిష్కారం దిశగా పోరాడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఎంతో నమ్మకం ఉంచి అండగా నిలిచిన ముస్లిం మైనార్టీలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నారు. గతంలో పాదయాత్రలో అడుగడుగునా ముస్లిం మైనారిటీలకు అనేక హామీలు గుప్పించిన నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆ హామీలకు తూట్లు పొడిచారని విమర్శించారు. ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మైనారిటీలకు న్యాయబద్ధంగా అందాల్సినటువంటి రుణాలను వైసీపీ ప్రభుత్వం ఇవ్వట్లేదని నిధులు మొత్తం వివిధ పథకాల్లో కలిపేసి ముస్లింలకు తీరని అన్యాయం చేస్తున్నారని తెలిపారు. తాను అధికారంలోకి వస్తే పేద ముస్లిం యువతుల వివాహానికి ప్రభుత్వం సాయంగా దుల్హన్ పథకం కింద ఇచ్చే 50 వేల రూపాయలను లక్ష రూపాయలు చేసి ఇస్తానని జగన్ తెలిపారని, కానీ నేడు ఏ ఒక్కరికి కూడా ఈ పథకం కింద సాయం లేదని, దుల్హన్ పథకాన్ని పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ లో సైతం ఉర్దూని రెండో అధికారిక భాషగా ప్రకటిస్తానని జగన్ మాట ఇచ్చారని, కానీ నేడు అలా ప్రకటిస్తే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, ప్రతి గ్రామ సచివాలయంలో ట్రాన్సలేటర్ ఉద్యోగం ఇవ్వాల్సి వస్తుందని, వేలాది ట్రాన్సలేటర్ ఉద్యోగాలు ముస్లిం యువతకు వస్తాయని, కానీ ఇచ్చిన మాట ప్రకారం ఉర్దూని ప్రకటించకుండా ముస్లిం యువతకు జగన్ తీరని మోసం చేశారని కేతంరెడ్డి వివరించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రంజాన్ పండుగ నాడు ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రేషన్ దుకాణాల ద్వారా రంజాన్ కానుక ఇచ్చే సంస్కృతికి శ్రీకారం చుట్టారని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ సంస్కృతిని కొనసాగించారని, కానీ వైఎస్ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి అయ్యాక మైనారిటీ సోదరులకు ఉన్నటువంటి కానుకని రద్దు చేశారని కేతంరెడ్డి గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులకు కూడా ఈ ప్రభుత్వంలో ప్రమాదం పొంచి ఉందని, అనేక ప్రదేశాల్లో ఆ ఆస్తులకు సంబంధించి జరుగుతున్నటువంటి ఆందోళనలే రుజువు అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ముస్లిం మైనారిటీలకు సంపూర్ణ న్యాయం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే జరుగుతుందని, జనసేన పార్టీ సిద్ధాంతాలలోనే ఆ అంశం ఉందని, కనుక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ముస్లిం సోదరులు అందరూ పవనన్నకు అండగా నిలబడి సీఎం కావాలని దువా చేయాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com