ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో అంతరిక్ష రంగంలో భారత కీర్తిపతాకం రెపరెపలాడింది. జులై 14న శ్రీహరికోట నుంచి రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 వ్యోమనౌక అనేక దశలను దాటుతూ జాబిల్లికి చేరువైంది.
తర్వాత అందులోని విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న చందమామ దక్షిణ ధృవంపై ల్యాండ్ అయింది. అనంతరం ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చి పని ప్రారంభించింది. ఈ మహత్తర ఘట్టాన్ని చూసి యావత్ భారతావని ఉప్పొంగింది. అయితే ఇంతటి ఘనకీర్తి పొందిన ఇస్రోలో, సాధారణ డిగ్రీ పూర్తి చేసిన వారు సైతం ఉద్యోగాలు పొందవచ్చు. గ్రాడ్యుయేషన్ అర్హతతో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలను ఇస్రో భర్తీ చేస్తోంది. దీనికి సంబంధించిన రాత పరీక్ష వచ్చే నెలలో జరగనుంది.
* జాబ్ ప్రొఫైల్
ఇస్రోలో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు ఎంపికయ్యే అభ్యర్థులు తమకు కేటాయించిన అన్ని పనులను చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా సీనియర్ ఎంప్లాయిస్‌కు ప్రతిరోజు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అందించాలి. ఫోన్ కాల్స్‌కు ఆన్సర్ చేయడం, అపాయింట్‌మెంట్స్ షెడ్యూలింగ్, వర్క్ షెడ్యూల్‌ను ఆర్గనైజ్ చేయాలి. ఉన్నతాధికారులు అప్పగించిన అన్ని పనులను సకాలంలో పూర్తిచేయాలి.
* జీతభత్యాలు
ఇస్రోలో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్‌కు ఎంపికయ్యే వారికి వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి 3.50 లక్షల మధ్య ఉంటుంది. వార్షిక ప్యాకేజీలో బేసిక్ వేతనంతో పాటు కొన్ని రకాల అలవెన్సులు ఉంటాయి. ప్రధానంగా డియర్‌నెస్ అలవెన్స్, హౌస్‌రెంట్ అలవెన్స్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కలిసి ఉంటాయి. న్యూ పెన్షన్ స్కీమ్, అభ్యర్థి అతనిపై ఆధారపడిన వారికి మెడికల్ ఫెసిలిటీస్, క్యాంటిన్, క్వార్టర్ ఫెసిలిటీ, లీవ్ ట్రావెల్ అలవెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌డ్ వంటి సౌకర్యాలు ఉంటాయి.
* కెరీర్ గ్రోత్
ఇస్రోలో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యే వారి కెరీర్ వృద్ధికి అనేక అవకాశాలతో పాటు ఆకర్షణీయమైన ప్యాకేజీ, ఉద్యోగ భద్రత లభిస్తుంది. ప్రొబేషన్ పీరియడ్ ముగిసిన తర్వాత పనితీరు, సీనియారిటీ, ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా ప్రమోషన్స్ లభిస్తాయి. ప్రమోషన్ కోసం అంతర్గతంగా జరిగే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే పదోన్నతి పొందుతారు. అదే క్రమంలో అధిక వార్షిక ప్యాకేజీ, ప్రయోజనాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.
* సెప్టెంబర్ 24న రాత పరీక్ష
కాగా, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్‌ల భర్తీకి ఇస్రో గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 154 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను 2022 డిసెంబర్ 20న ప్రారంభించింది. ఈ గడువు 2023 జనవరి 16న ముగిసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూ రౌండ్ ఉంటాయి. ఆన్‌లైన్ రాత పరీక్ష వచ్చే నెల సెప్టెంబర్ 24న జరగనుంది. ఇందుకోసం అడ్మిట్ కార్డ్‌లను త్వరలో జారీ చేస్తారు. ఫలితాల అనంతరం ఇంటర్వ్యూకు షెడ్యూల్ ప్రకటిస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో సెంటర్స్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com