పవర్ స్టార్ గా తన నటనతో మనసులను రంజింప చేసిన వెండి తెర వేల్పు, తన వ్యక్తిత్వంతో కోట్ల అభిమానుల గుండెల్లో కొలువైన డెమిగాడ్. సినీ రంగంలో అత్యున్నత స్థానం తృణ ప్రాయం అనుకొని జనం అంటే ప్రేమ, సమాజం అంటే బాధ్యత, దేశమంటే భక్తి, ఎక్కడ సమస్య ఉన్నా సాయం అందించే ఆప్తుడు, ఎక్కడ కష్టం ఉన్నా స్పందించే ఆపద్బాంధవుడు, ఒకటా రెండా ఇచ్చిన చేతికి లెక్క తెలియదు సహాయం పొందిన వారు లెక్కకు మించి. ఎదుటి వారి కష్టానికి తన కంట నీరు చిందించగల గుణం కొందరికే ఉంటుంది. అది పవన్ కళ్యాణ్ గారిలో మోతాదుకు మించి ఉంది. సాయం అని అడిగితే ఖాయంగా చేసేస్తాడు. ముక్కు సూటిగా మాట్లాడటం ఆయన తత్వం. మాట తప్పని స్థిరమైన నిజాయితీ, నిబద్దత నిండిన వ్యక్తిత్వం, ఎంచుకున్న మార్గాన్ని వీడక పోరాడే గుణం.
కోట్లు సంపాదించి పెట్టే రంగం అత్యున్నత స్థానం అందరికి లభించవు ఆ గ్లామర్ ప్రపంచాన్ని, ఆస్థానాన్ని ఎవరూ అంత సులువుగా వదులుకోలేరు. పైగా కాపాడుకునేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తారు. అంతటి స్థాయిని, స్థానాన్ని సులువుగా వదిలేందుకు సిద్ధమయ్యాడు. కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే రంగానికి తాత్కాలిక విరామం ఇచ్చి జనసైన్యానికి నాయకుడిగా, జనసేన అధినాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. సవాళ్ళతో సావాసం, నిందలతో ప్రయాణం ఉంటుందని తెలిసినా ప్రత్యక్ష రాజకీయం వైపే అడుగులు వేశారు. అడుగడుగునా అడ్డంకులు, వ్యక్తిని ఎదుర్కోలేక చేసే వ్యక్తిగత దూషణలు, అనుభవం లేదని కొందరు, రంగులు పూసుకొనే వ్యక్తికి రాజకీయం ఎందుకని కొందరు పిచ్చి ప్రేలాపనలు చేశారు. వెనక్కి తగ్గని నైజం కనుక ఎదురు దెబ్బలు తిన్న కొద్దీ స్థిరంగా నిలబడి సమస్యల కోసం సామాన్యుని స్వరానికి తానే గళంగా మారి ప్రశ్నిస్తూ సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం చేస్తున్నాడు. సినిమా రంగాన రారాజు గా ఉన్నప్పుడు పొగిడిన నోర్లు నేడు తిట్టడానికి వెనుకాడట్లేదు వారికి అర్ధం కాని విషయం ఏంటంటే సినిమా నటుడిగా ఆయన వేసుకునే చొక్కా, ప్యాంటు, జుట్టు ఏదైనా Fashion అనుకొనే యువత నేడు ఆయన రాజకీయాల్లో, సమాజంలో, ఆలోచన విధానంలో చేస్తున్న ప్రతి పనినీ Passion గా, Inspiration గా మార్చుకుంటున్నారు.
సామాన్యులు రాజకీయం చేయాలి, యువత నుండి నాయకులను తయారు చేయాలన్న పవన్ కళ్యాణ్ గారి తపన ఒక రూపం దాల్చుకుంది. 2014లో జనసేన పార్టీ ఆవిర్భావం సరికొత్త అధ్యాయానికి తెర తీసింది. ఆయన అడుగులు మార్పు వైపు, ఆయన ఆలోచనలు నూతన ఒరవడి వైపు, ఆయన సిద్ధాంతాలు సమ సమాజ స్థాపన కొరకు, ఆయన ఆశయాలు చైతన్యం నింపేందుకు యువతను జాగృతం చేసి జనసైన్యం గా మార్చుకుంటున్నాడు. ఆయన తలపెట్టిన యజ్ఞం విఫలం కాలేదు, ప్రయత్నం వృధా కాలేదు ధనం ప్రధాన పాత్ర పోషించే రాజకీయాల్లో అభిమానం ఆశయానికి తోడుగా ఏ స్వార్ధం లేకుండా నడవటం మార్పుకి నాంది పలికినట్లే.
ఇది ఆయన చిత్తశుద్ధి తో చేపట్టిన సంకల్పం, ఆశయాల ప్రయాణం కాబట్టే ఇంత మంది నిస్వార్థ జనసైనికులు గా మారారు ఆయనను అనుసరిస్తున్నారు నాయకులుగా ఎదుగుతున్నారు. ప్రశ్నించే గొంతుకలుగా మారి ఇతరుల సమస్యల కోసం పోరాడుతున్నారు. ఇలా ప్రజలకోసం నిత్యం పోరాడుతూ ఉండటం ప్రత్యర్ధులు ఊహించని ప్రస్థానం. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నడతలో మార్పు లేదు, నడకలో మార్పు లేదు, నడవడిక మాత్రమే మారింది జనం కోసం పిడికిలి బిగించాడు. ఈయనేం రాజకీయాలు చేస్తాడు అన్నవాళ్ళు సైతం ఆశ్యర్య పోయేలా రాజకీయం అంటే ఇలా ఉంటుందా అని అనిపించేలా నిర్ణయాలు తీసుకున్నాడు. సంస్థాగత నిర్మాణం లేదు అనే విమర్శకులకు ధీటైన జవాబు చేతల్లోనే చూపించారు. జాప్యం జరిగినా అడుగులు తడబడలేదు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాలంతో పరుగులు పెట్టకుండా కార్య సాధనకు కృషి చేస్తున్నారు. ఒక్క ప్రయత్నం తోనే గెలుపు సిద్దిస్తే నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉండదు ఆ పరాజయమే జనసేనకు కలిసొచ్చిన వరం. దిన దినప్రవర్ధమానంగా పార్టీ ఎదుగుదలకు ఆయువు పోస్తోంది. ప్రజా సమస్యలను బట్టబయలు చేస్తూ నిద్రాణ స్థితిలో ఉన్న ప్రజలను చైతన్యవంతం చేస్తున్న జనసేనానికి శత మానం భవతి!!
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com