అమరావతి, (జనస్వరం) : తీవ్ర ఆందోళనలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కాంట్రాక్ట్ ఉద్యోగుల సహేతుకమైన డిమాండ్లను వైసీపీ ప్రభుత్వం పరిష్కరించాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2010లో టీటీడీ నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను సొసైటీలుగా ఏర్పాటు చేసుకోవాలని సూచించిందన్నారు. ఆ విధంగా సొసైటీలు ఏర్పాటయ్యాయని తెలియజేసారు. మరి కొత్తగా ఇప్పుడు కార్పోరేషన్ ఎందుకు? అని ప్రశ్నించారు. ఉన్న వ్యవస్థలను మార్చే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఈ అంశంలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించి ఘోర వైఫల్యం చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడమే కాక వారి జీవితాలలో అల్లకల్లోలం సృష్టించిందని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకొనే పలు నిర్ణయాలు ప్రజలను ఇబ్బందులకి గురిచేస్తున్నాయని ఆయన అన్నారు. ఉదాహరణలు చెప్పుకొంటే.. ఇసుక పాలసీ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు. ఆ రీతిలోనే 73 సంఘాలను రద్దు చేసి కార్పోరేషన్ గా మార్చడం... ఉద్యోగులను రోడ్డు మీదకు ఈడ్చే దారుణమైన చర్యలు అని అన్నారు. దీనిని పొమ్మనకుండా పొగపెట్టడం లాంటి నిర్ణయంగా భావించాలని కోరారు. ఒకే పని చేస్తున్న రెగ్యులర్ కార్మికులకు కానీ, టెంపరరీ కార్మికులకు కానీ ఒకే వేతనం చెల్లించాలన్న జస్టిస్ జె.ఎస్.ఖేహార్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్డు 2016లో వెలువరించిన తీర్పును పూర్తిగా విస్మరించారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ తీర్పును ఉల్లంఘించిందని ఆయన అన్నారు. కార్పోరేషన్ లో చేరని ఉద్యోగులను.. మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారన్నారు. వారిని కార్పోరేషన్ లో చేరాలని బలవంతపెట్టడం శ్రామిక చట్టాలను ఉల్లంఘించడం కాదా? సామాన్యుడి మదిలో ఉదయిస్తున్న ప్రశ్నలు ఇవే. కొత్తగా కార్పోరేషన్ ఏర్పాటు చేయడం... నిధులు దారి మళ్లించేందుకేనా? బోర్డును నియమించే హక్కు ఎవరికుంది? ఈ ప్రక్రియలో పారదర్శకత ఉందా? అని ప్రశ్నించారు. వైసీపీ ఆధ్వర్యంలో నడిచే టీటీడీ బోర్డు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు సేవలందించే తిరుమల ఆలయంలో నిత్య కైంకర్యాలలో భాగస్వామ్యులైన 73 సొసైటీలలో ఉన్న నాలుగు వేలమంది ఉద్యోగులను ఒప్పించ లేకపోయిందా? అని అన్నారు. నాలుగు వేల మంది ఉద్యోగులకు మద్దతు కల్పించాలన్న ఉద్దేశ్యం లేని వైసీపీ, వారికి పాదయాత్రలో ఎందుకు హామీలు ఇచ్చిందని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసానిచ్చారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com